స్వస్తిక్ ముద్ర విశిష్టత ఎలాంటిది ?

స్వస్తిక్ ముద్ర విశిష్టత ఎలాంటిది ?
స్వస్తిక్ ... ఇది ఎడమ నుంచి కుడికి తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ, కాలచక్రంలా అనిపిస్తూ వుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో 'ఓం' అనే ముద్రకి ఎంతటి ప్రాముఖ్యత వుందో, 'స్వస్తిక్' ముద్రకు సైతం అంతే ప్రాధాన్యత వుంది. పూజా మందిరాల్లో 'ఓం' అనే ముద్రతో పాటుగా 'స్వస్తిక్' ముద్ర కూడా తప్పనిసరిగా కనిపిస్తూ వుంటుంది. దీనిని తడి పసుపుతో రాసి ... కుంకుమ బొట్లు పెడుతూ వుంటారు.

వినాయకుడి పూజా విధానంలో స్వస్తిక్ ముద్ర మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక ప్రత్యేక పూజల సమయంలో కలశ స్థాపన చేసేటప్పుడు, ముందుగా పీఠంపై స్వస్తిక్ ముద్రను దిద్దడం జరుగుతుంది. అలాగే చాలామంది తమ ఇంటికి రక్షణగా గుమ్మంపైనగానీ, పక్కనే గాని స్వస్తిక్ ముద్రను గీస్తుంటారు. వాస్తుపరమైన దోషాలను సైతం స్వస్తిక్ ముద్ర నివారిస్తుందని భావిస్తుంటారు. ఇక ఇళ్లలోనే కాదు ఆధునీకతకు అద్దంలా కనిపించే ఆఫీసుల్లోనూ, శుభం - లాభం అనే మాట కనిపించే వ్యాపార సంస్థలలోనూ స్వస్తిక్ ముద్ర కనిపిస్తూ వుంటుంది.

స్వస్తిక్ ముద్ర శుభాలను ... విజయాలను ప్రసాదిస్తూ ఉంటుందనే నమ్మకం ప్రాచీనకాలం నుంచి వుంది. స్వస్తిక్ ని పూజించడమంటే కాలచక్రాన్ని పూజించడమేననీ, కనికరించమని కాలాన్ని వేడుకోవడమేనని చాలామంది విశ్వసిస్తూ వుంటారు. ఈ కారణంగానే స్వస్తిక్ ముద్ర అపసవ్యంగా లేకుండా అంతా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. స్వస్తికి ముద్ర వ్యతిరేక దిశలో గనుక ఉన్నట్టయితే, ప్రతి విషయంలోనూ వ్యతిరేక ఫలితాలను చూడవలసి వస్తుందని అంటారు. ఆశించిన ఫలితాలు తారుమారుకాకుండా ఉండాలంటే, స్వస్తిక్ ముద్ర సవ్యంగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

More Bhakti Articles