చారిత్రక క్షేత్రం వెనుక ఆసక్తికర నేపథ్యం ఇదే!

చారిత్రక క్షేత్రం వెనుక ఆసక్తికర నేపథ్యం ఇదే!
పుణ్యక్షేత్రాలు రెండు విధాలుగా మనకి కనిపిస్తూ వుంటాయి. కొన్ని పురాణ ప్రాశస్త్యమైనవి కాగా, మరికొన్ని చారిత్రక నేపథ్యంగలవి. పురాణపరమైన క్షేత్రాలలోని విశేషాలు ఒకరి నుంచి ఒకరికి తెలుస్తూ వస్తుంటాయి. ఇక చారిత్రక పరమైన విశేషాలు శాసన ఆధారాల ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి. అలా చారిత్రక సంఘటనకు నిలువెత్తు నిదర్శనంగా గల క్షేత్రం గుంటూరు జిల్లా 'పెద్దకొదమగండ్ల'లో కనిపిస్తుంది.

ఈ క్షేత్రంలో ఉత్తరేశ్వరస్వామి ... పార్వతీదేవి సమేతంగా కొలువై పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక ఈ ఆలయ నిర్మాణం వెనుక పల్నాటి వీరులకు సంబంధించిన చారిత్రక నేపథ్యం ఆసక్తికరంగా కనిపిస్తుంది. తనని పెంచి పెద్ద చేశాడనే కృతజ్ఞత కూడా లేకుండా ఉత్తరుడు ... అనుగురాజును అంతం చేయించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో తానే ప్రాణాలు కోల్పోతాడు.

ఇంత జరిగినా ఉత్తరుడి పేరున అనుగురాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఈ కారణంగానే ఇక్కడి శివుడు ఉత్తరేశ్వరుడి పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఆనాటి నిర్మాణ శైలిని ఈ ఆలయం అందంగా ఆవిష్కరిస్తూ వుంటుంది. ఆలయ ప్రాంగణంలో గల శాసనాలను చదివితే, ఆనాటి సంఘటనలు కళ్లముందు కదలాడతాయి. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన కోరిన కోరికలు నెరవేరతాయని స్థానికులు చెబుతుంటారు.

విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి. ఘనంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలోనే తరలివస్తుంటారు. సాధారణ భక్తులతో పాటు .. చారిత్రక విషయాల పట్ల ఆసక్తి వున్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తూ వుంటారు ... ఆదిదేవుడి అనుగ్రహాన్ని అందుకుంటూ వుంటారు.

More Bhakti Articles