శ్రీరాముడు ప్రత్యక్ష్య దర్శనమిచ్చిన క్షేత్రం

శ్రీరాముడు ప్రత్యక్ష్య దర్శనమిచ్చిన క్షేత్రం
లోక కల్యాణం కోసం శ్రీరామచంద్రుడిగా అవతరించినది శ్రీమన్నారాయణుడే. అలాంటి నారాయణుడు భక్తుడి ముచ్చటతీర్చడం కోసం శ్రీరాముడిగా కనిపించిన క్షేత్రం ఒకటుంది ... అదే 'తిరువెళ్లియం గుడి'. అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం తమిళనాడు - కుంభకోణం సమీపంలో విలసిల్లుతోంది. పరమపవిత్రమైన ఈ క్షేత్రం భ్రుగుపురిగా ... భార్గవ పురంగా భక్తులచే పిలవబడుతోంది.

గర్భాలయంలో స్వామివారు అనంతుడిపై శయనిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి స్వామివారిని ఎంతోమంది మహర్షులు దర్శించి పూజించారు. వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. అయితే ఆయనను శ్రీరామచంద్రుడిగా చూడాలని వుందని మహర్షులు తమ మనసులోని కోరికను బయటపెడతారు.

మహర్షుల ముచ్చట తీర్చడం కోసం విష్ణుమూర్తి, విల్లుత్తో శ్రీరామచంద్రుడిగా సాక్షాత్కరించాడు. భక్తులు కోరగా విల్లుతో ప్రత్యక్షమైన రాముడు కనుక, ఇక్కడి స్వామిని 'కోలవిల్లి రామచంద్రుడు' పేరుతో కొలుస్తుంటారు. ఇక్కడి స్వామివారి సౌందర్యాన్ని చూడవలసిందేగానీ మాటల్లో చెప్పలేం. 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందిన ఈ క్షేత్రం, అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది.

ఇక్కడి 'బ్రహ్మతీర్థం'స్వామి సంకల్పం కారణంగా ఏర్పడిందనీ. సమస్త పాపాలను పటాపంచలు చేస్తుందని చెబుతారు. ఈ ఆలయం అక్షయపాత్ర వంటిదనీ ... కోరిన వరాలు వెంటనే దక్కుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. విశేషమైన పుణ్యతిథుల్లో స్వామివారికి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తుంటారు. ఆ వైభవాన్ని తిలకించడానికి రెండుకళ్లు సరిపోవు ... ఆ అనుభూతిని పొందడానికి ఒక మనసు చాలదు.

More Bhakti Articles