దేవుడే అక్కడ ఆ నియమం విధించాడట !

దేవుడే అక్కడ ఆ నియమం విధించాడట !
ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాలు నిర్మించబడతాయి. గర్భాలయాల్లో దైవ ప్రతిమలు ప్రతిష్ఠించబడతాయి. అలా ప్రాణప్రతిష్ఠ చేయబడిన ప్రధానమూర్తులనే భక్తులు దర్శించుకుంటూ వుంటారు. పూజాభిషేకాలు జరిపిస్తూ పునీతులవుతుంటారు. తమ గ్రామంలోని ఆలయం శిధిల స్థితికి చేరుకున్నా, అసలు అక్కడి స్వామికి ఆలయమే లేకున్నా భక్తులు ఎంతమాత్రం సహించరు. అంతా ఒక బృందంగా ఏర్పడి తమ దేవుడికి ఆలయాన్ని నిర్మిస్తారు.

అలా భక్తుల సంకల్ప బలంతో నిర్మించబడిన ఆలయం మనకి కర్నూలు జిల్లా 'ఎస్. కొత్తూరు'లో కనిపిస్తుంది. చాలాకాలం కిందట భక్తులు చూస్తూ ఉండగానే, సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ సర్పరూపాన్ని సంతరించుకోవడాన్ని మహిమాన్వితమైన సంఘటనగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఇక్కడ ఆలయంలో ప్రధాన ద్వారం ... ముఖమంటపం కనిపిస్తాయేగానీ, గర్భాలయం కనిపించకపోవడం ఆశ్చర్యచకితులను చేస్తుంది.

స్వామివారు గర్భాలయంలో కాకుండా, చుట్టూ కటాంజనాలు ఏర్పాటుచేయబడిన మంటపం వంటి ప్రదేశంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. స్వామివారికి గర్భాలయం నిర్మించక పోవడానికి కారణం ఆర్ధికపరమైన ఇబ్బందులుగానీ, భక్తుల ఉదాసీనతగాని కారణం కాదు. స్వామి వారు విధించిన నియమమే అందుకు కారణమని స్థానికులు చెబుతూ వుంటారు.

తన గర్భాలయ నిర్మాణాన్ని ఎప్పుడు తలపెట్టినా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దానిని పూర్తి చేయాలని స్వామి స్వప్న దర్శనమిచ్చి చెప్పాడట. అలా పూర్తిచేయని పక్షంలో ఆ ప్రాంతంలో కరవుకాటకాలు ఏర్పడతాయని అన్నాడట. ఆగమశాస్త్రం ప్రకారం అది అసాధ్యంగా భావించిన స్థానికులు, ప్రస్తుతం స్వామివారు వున్న ప్రదేశాన్నే గర్భాలయంగా భావిస్తూ ... స్వామికి ఎలాంటి లోటు రానీయకుండా చూసుకుంటున్నారు.

More Bhakti Articles