మనసుకు శాంతిని ప్రసాదించే సాయిబాబా

మనసుకు శాంతిని ప్రసాదించే సాయిబాబా
గురువు ... దేవుడు ఇద్దరూ ఒకేసారి తనకి ఎదురుపడితే, ముందుగా గురువుకే నమస్కరిస్తానని చెప్పాడు కబీరుదాసు. ఎందుకంటే ఆ దేవుడిని చూపించినది ... ఆయన వైపు నడిపించినది గురువేనని అన్నాడు. అలా ఒక గురువుగా అనేకమందిని ప్రభావితం చేసిన వారిలో శ్రీ శిరిడీసాయిబాబా ఒకరు.

బాబా ఎలాంటి రచనలు చేయలేదు ... తన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించనూ లేదు. సఖ్యతగా మసలుకోమనీ ... సన్మార్గంలో ప్రయాణించమని మాత్రమే ఆయన చెప్పేవాడు. అలాంటి వాళ్లకి తానెప్పుడూ తోడుగా ఉంటానని అనేవాడు. ఈ విషయంలో ఆయన ప్రజల హృదయాలను చూరగొన్న కారణంగానే అనేక ప్రాంతాల్లో ఆయన ఆలయాలు ఆవిర్భవించాయి.

అలాంటి విశిష్ట ఆలయాలలో ఒకటి 'అమరావతి'లో దర్శనమిస్తుంది. దేవతలు నడయాడిన పుణ్య ప్రదేశంగా అమరావతి ప్రసిద్ధి చెందింది. అక్కడి పవిత్ర కృష్ణానదీ తీరంలో శిరిడీసాయిబాబా ఆలయం దర్శనమిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయంలో ప్రశాంతతయే ప్రసాదంగా లభిస్తుంది. కష్టాలు తీర్చడానికీ .. కన్నీళ్లు తుడవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా బాబా కనిపిస్తూ వుంటాడు.

అభిషేకాలు ... అలంకారాలు ... హారతులు భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరింపజేస్తాయి. పావురం రూపంలో బాబా ఇక్కడ సంచరిస్తూ ఉంటాడని భక్తులు చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల హనుమంతుడు ధ్యానముద్రలో కూర్చుని కనిపిస్తూ మంత్రముగ్ధులను చేస్తుంటాడు. ధ్యానం చేసుకోవడానికి ఇది సరైన ప్రదేశమని చెప్పకనే చెబుతుంటాడు.

More Bhakti Articles