శ్రీరాముడు ఎవరి గురించి బాధపడ్డాడు ?

  శ్రీరాముడు ఎవరి గురించి బాధపడ్డాడు ?
శ్రీరామచంద్రుడి దర్శన భాగ్యం లభిస్తుందని మతంగమహర్షి చెప్పడం వలన, అనుదినం ... అనుక్షణం ఆయన కోసం ఎదురుచూస్తూ గడుపుతుంది శబరి. అలా వృద్ధాప్యంలోకి అడుగు పెట్టినా అంతే భక్తి శ్రద్ధలతో ఆమె రాముడి కోసం నిరీక్షిస్తూ వుంటుంది. ప్రతినిత్యం ఆశ్రమంలో అలికి ముగ్గులు పెడుతూ .. అలంకరిస్తూ వుండేది. అలాంటి శబరికి సీతాన్వేషణ సమయంలో దర్శనమిస్తాడు శ్రీరామచంద్రుడు.

తన కోసం ఆమె ఎంతకాలంగా ఎదురుచూస్తూ వుందో, ఎంతగా ఆరాటపడుతూ వుందో తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ప్రేమతో ఆమె రుచి చూసి ఇచ్చిన పండ్లను తిని, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఆ తరువాత రావణుడిని సంహరించి, సీతాదేవిని వెంటబెట్టుకుని అయోధ్యకి చేరుకుంటాడు. సీతారాములు అయోధ్యకి తిరిగి రావడమంటే అది అందరికీ పండుగ రోజే.

అయోధ్యవాసులందరూ ఆత్మీయంగా పలకరిస్తూ వుంటే, చిరునవ్వుతోనే వాళ్లని పలకరిస్తూ సీతారాములు ముందుకుసాగుతారు. కౌసల్య .. కైకేయి .. సుమిత్ర .. రాముడికి ఎంతో ఇష్టమైన వంటకాలు సిద్ధం చేస్తుంటారు. ఈలోగా వివిధ రకాల ఫలాలను ఆయన ముందుంచుతారు. రాముడు ఆ ఫలాలను ఇష్టంగా ఆరగించకపోవడం వాళ్లకి సందేహాన్ని కలిగిస్తుంది. విషయమేవిటంటూ వాళ్లు రాముడి మనసు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ఏ ఫలాలను ఆరగిద్దామన్నా అవి శబరి తినిపించినంత తియ్యగాలేవనీ చెబుతాడు రాముడు. చూపు మందగించేలోగా తనని చూడటం కోసం ఆమె పడిన ఆరాటాన్ని ఆయన గుర్తుకు చేసుకుంటాడు. ఆమె కళ్లలో దాగిన ప్రేమ ... మనసులోని అనురాగం ... మాటలోని ఆప్యాయతను తాను ఎక్కడా చూడలేదని అంటాడు. అనంతమైన అనురాగం కారణంగానే ఆమె చేతి ఫలాలు సహజత్వానికి మించి రుచిని అందించాయని చెబుతాడు. అపారమైన ప్రేమానురాగాలతో అందించబడిన ఫలాలు మరింత మధురంగా ఉంటాయనే విషయం తనకి శబరి మూలంగానే తెలిసిందని అంటాడు. ఆమె ఆప్యాయతను పొందడం నిజంగా తన అదృష్టమంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

More Bhakti Articles