బాణలింగాన్ని పూజించడం వలన కలిగే ఫలితం!

బాణలింగాన్ని పూజించడం వలన కలిగే ఫలితం!
బాణలింగ పూజ వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే బాణలింగం అంటే ఏమిటి? అది ఎలా వుంటుంది ? అనే సందేహం భక్తులకు కలుగుతూ వుంటుంది. ప్రాచీనకాలంలో బాణలింగాలు కొన్ని ప్రాంతాల్లో ... కొన్ని క్షేత్రాల్లో మాత్రమే కనిపించేవి. ఆధునిక కాలంలో నిర్మిస్తోన్న శివాలయాలలో చాలావరకూ బాణలింగాలనే ప్రతిష్ఠచేస్తూ వస్తున్నారు. అందువలన బాణలింగాలు చూడటానికి అందరికీ అందుబాటులోనే వుంటాయి.

ఇక ఈ బాణలింగాలు గుడ్డు ఆకారంలో ఎంతో నున్నగా వుంటాయి. ఎంత తేనెపోస్తే అంత ఎత్తుకునేంత నున్నగా ఈ బాణలింగాలు కనిపిస్తుంటాయి. ఏ మాత్రం ఎగుడు దిగుడు లేకుండా ఒకే విధమైన కోణాలను కలిగి, ఆకర్షణీయంగా కనిపించడం బాణలింగం ప్రత్యేకత. ఇవి తెలుపు ... నలుపు ... నేరేడు పండు ... గచ్చకాయ ... తేనె రంగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వివిధ వర్ణాల మేళవింపుతో .. వివిధ పరిమాణాలతో కనువిందు చేస్తుంటాయి.

బాణలింగాలు ఎక్కువగా నర్మదా నదీ ప్రాంతంలో లభిస్తూ వుంటాయి. బాణాసురుడుకి ఇచ్చిన వరం ప్రకారం శివుడు ఇక్కడ లింగరూపాల్లో లభిస్తూ ఉంటాడనీ, ఈ కారణంగానే వీటికి బాణలింగం అనే పేరు వచ్చిందని అంటారు. ఇక ఈ బాణలింగాలను అభిషేకిస్తూ వుంటే చూడటానికి రెండుకళ్లు చాలవు. మట్టి .. పటిక .. స్పటిక .. వెండి .. బంగారం .. తదితర శివలింగాలను పూజించడం వలన కలిగే పుణ్యఫలం, ఒక్క బాణ లింగాన్ని పూజించడం వలన లభిస్తుందని చెప్పబడుతోంది. బాణలింగాన్ని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయనీ, సుఖసంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.

More Bhakti Articles