పాపవిమోచన ఏకాదశి ప్రత్యేకత

పాపవిమోచన ఏకాదశి ప్రత్యేకత
స్వర్గం ... నరకం ... పాపం ... పుణ్యం అనేవాటిని చాలామంది విశ్వసిస్తూ వుంటారు. పుణ్యం చేసిన వాళ్లు మరణానంతరం స్వర్గంలో భగవంతుడికి సమీపంగా ఉంటారనీ, పాపం చేసిన వాళ్లంతా నరకంలో శిక్షలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇవన్నీ ఎవరు చూసి వచ్చారు ... ఎవరు ఎవరితో చెప్పారని కొంతమంది కొట్టి పారేస్తుంటారు. ఇక పురాణాలను ప్రమాణంగా తీసుకునే వాళ్లు పాపపుణ్యాలను విశ్వసిస్తూ వుంటారు.

నరకంలో అమలుచేసే శిక్షలలో ఒక్కొక్క దాన్ని గురించి తెలుసుకుంటూ పోతుంటే, భగవంతుడా ఇకపై ఒక్క పాపం కూడా చేయను అని గట్టిగా అరవాలనిపిస్తుంది. మరి చేసిన పాపాల మాటేమిటి? అనే సందేహం ఆ సమయంలోనే వస్తుంది. తెలిసీ తెలియక ఎన్నో పాపాలు చేసి వుంటాం, ఏదో ఒక పుణ్యకార్యం చేసి పాపాల కూపం నుంచి బయటపడాలని అనుకోవడం సహజం. అలాంటివారికి ఆ దేవుడు ఇచ్చిన అవకాశంగా 'పాపవిమోచన ఏకాదశి' ని చెప్పుకోవచ్చు.

చైత్ర బహుళ ఏకాదశినే పాపవిమోచన ఏకాదశి అనీ ... సౌమ్య ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని అలంకరించి, శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఉపవాసదీక్షను చేపట్టి వైష్ణవ క్షేత్రాలను దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయాలి.

ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త పాపాలు పటాపంచలు అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఓ మహర్షి కారణంగా శాపానికి గురైన 'మంజు ఘోష' అనే అప్సరస, పాపవిమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ శాపం బారి నుంచి బయటపడిందని చెప్పబడుతోంది.

More Bhakti Articles