భగవంతుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు

భగవంతుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు
భగవంతుడు సర్వాంతర్యామి ... ఆయనలేని చోటుగానీ, ఆయన కరుణ అవసరంలేని జీవి గాని వుండదు. ఆయన దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇందుకు ఉదాహరణగా ఆధ్యాత్మిక గ్రంధాలలో ఒక కథ కనిపిస్తుంది. ఒక మహర్షి తన శిష్యులలో ఎవరు పరిపక్వతను సాధించారో తెలుసుకోవాలనుకుంటాడు. నలుగురికి నాలుగు ఫలాలు ఇచ్చి ఎవరూ చూడకుండా వాటిని తినేసి తన దగ్గరికి రమ్మని చెబుతాడు.

వాళ్లలో ముగ్గురు శిష్యులు వెంటనే తిరిగివచ్చి ఎవరికంటా పడకుండా ఆ ఫలాలను తినేసినట్టుగా చెబుతారు. ఒక శిష్యుడు మాత్రం కొన్ని రోజులకు తిరిగివచ్చి, తాను ఆ ఫలాన్ని తినలేకపోయానని చెబుతాడు. ఎక్కడికి వెళ్లి ఆ ఫలాన్ని తినడానికి ప్రయత్నించినా భగవంతుడు చూస్తూనే ఉన్నాడని అంటాడు. అప్పుడా శిష్యుడిని ఆ మహర్షి ఆభినందిస్తూ ఆలింగనం చేసుకుంటాడు. భగవంతుడు అంతటా వున్నాడు ... అన్నింటినీ గమనిస్తూనే ఉంటాడనే విషయాన్ని ఈ కథ స్పష్టం చేస్తూ వుంటుంది.

ఇక కొంతమంది చిత్తశుద్ధిలేని పూజలు .. భజనలు చేస్తుంటారు. దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలలో అతిగా జోక్యం చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. తమకన్నా భక్తిపరులు లేరన్నట్టుగా వ్యవహరిస్తూ వుంటారు. ఇలాంటి వారి ధోరణికి ఎవరూ అడ్డు చెప్పకపోతే, దేవుడు తరువాత తామేనన్న స్థాయికి వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో అసలైన భక్తులు ఇబ్బంది పడిపోతుంటారు.

నిజానికి భక్తి అనేది ఇతరుల ముందు హడావిడిగా ప్రదర్శించేది కాదు. అది మనసుకి సంబంధించినది, భక్తుడికి ... భగవంతుడికి మాత్రమే తెలిసినది. మన భక్తిని ఇతర భక్తులు గుర్తించాలను కోవడం అమాయకత్వం. నిజమైన భక్తి ఎలాంటి గుర్తింపును ... ఎవరి ప్రశంసలను ఆశించదు. అది భగవంతుడి సాన్నిధ్యాన్ని మాత్రమే సదా కోరుకుంటూ వుంటుంది.

More Bhakti Articles