ఆశ్చర్యచకితులను చేసే అద్భుత దృశ్యం

ఆశ్చర్యచకితులను చేసే అద్భుత దృశ్యం
ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ... విశిష్టత ఉంటూ వుంటాయి. అక్కడి విశేషాలను ఆ క్షేత్ర మహిమలుగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఆ మహిమలను ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తితో ఆయా క్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోతూ వుంటుంది. కొన్ని క్షేత్రాల్లో సూర్యుడి కిరణాలు గర్భాలయంలో గల స్వామివారిపై పడుతుంటాయి. ఇలాంటి క్షేత్రాలు మిగతా వాటి కంటే మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని కనిపిస్తుంటాయి.

ఇక ఉదయం శివుడిపై ... సాయంత్రం విష్ణుమూర్తిపై సూర్యకిరణాలుపడే క్షేత్రం లేకపోలేదు. ఆశ్చర్యచకితులను చేసే ఈ అరుదైన క్షేత్రం, గుంటూరు జిల్లా 'పెదపులి వర్రు' గ్రామంలో కనిపిస్తుంది. నిరంతరం హరినామస్మరణం చేసే నారదుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం విశేషం. ఆ శివలింగానికి వ్యాఘ్రపాద మహర్షి పూజాభిషేకాలు నిర్వహిస్తూ వుండగా ఆయనకి వరదరాజ స్వామి స్వయంభువు లభించింది.

శివాలయం పక్కనే ఈ విగ్రహానికి కూడా ఆయన ఆలయం నిర్మించాడు. ఇక్కడ ఉదయం వేళలో సూర్యుడి కిరణాలు శివుడి ఫాల భాగాన్ని తాకుతూ, ఆయన మూడవ కన్నులో నుంచి ఆ తేజస్సు పుట్టిందా ? అనే విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది. ఇక సాయంత్రం కాగానే సూర్య కిరణాలు వరదరాజ స్వామివారికి పాదాలను తాకుతుంటాయి. ఈ దృశ్యం చూస్తున్న వాళ్లకి సూర్యుడే ప్రత్యక్షంగా వచ్చి స్వామివారికి పాదపూజ చేస్తున్నాడా అనిపిస్తుంది.

మనోహరమైన ఈ దృశ్యం చూసి తరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శివకేశవులలో ఒకరిని ఉదయం వేళలోను ... మరొకరిని సాయంత్రం వేళలోను సూర్యుడు అర్చించే అరుదైన సంఘటన ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది.

More Bhakti Articles