సుఖసంతోషాలనిచ్చే శ్రీనివాసుడి క్షేత్రం

సుఖసంతోషాలనిచ్చే శ్రీనివాసుడి క్షేత్రం
తిరుమల గిరులపై ఆవిర్భవించిన వేంకటేశ్వరస్వామికి ఒక ప్రత్యేకత వుంది. భక్తులు ఎదురుగా నిలిచి చూసినంత సేపే తప్ప ఆ తరువాత ఆయన రూపం గుర్తుకురాదు. సమ్మోహనకరమైన ఆయన రూపాన్ని మనసులో బంధించడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా హృదయ ఫలకంపై నుంచి ఆ రూపం జారిపోతూనే వుంటుంది.

ఇక అంతటి సుందరమైన రూపాన్ని అనునిత్యం చూడాలనుకునే వాళ్లు, తమ గ్రామంలోగానీ ... కాలనీలో గాని వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపడుతుంటారు. అలా భక్తుల సంకల్ప బలంచే నిర్మించబడిన ఎన్నో ఆలయాలు నేడు విశిష్టమైనవిగా విలసిల్లుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటిగా హైదరాబాద్ - చందానగర్ ఆలయం విలసిల్లుతోంది. రాజగోపురం ... ప్రాకారాలు ... పుష్కరిణి ఇక్కడి ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటాయి.

గర్భాలయంలోని స్వామివారి ధృవమూర్తి తిరుమల శ్రీనివాసుడిని గుర్తుకుతెస్తుంది. ప్రత్యేక మందిరంలో పద్మావతీ అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తుంది. సువిశాలమైన ఈ ప్రాంగణంలోనే పార్వతీ పరమేశ్వరులు కూడా దర్శనమిస్తూ వుంటారు. శివకేశవ నిలయంగా అలరారుతోన్న ఈ క్షేత్రంలో, ఆయా పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి.

ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఇక్కడి స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, అంకితభావంతో ఆరాధిస్తే కష్టాలను పారద్రోలి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ప్రశాంతతకు నిలయంగా ... పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అడుగడుగునా భక్తిభావ పరిమళాలు వెదజల్లుతూ ఆధ్యాత్మిక పరమైన అనుభూతిని అందిస్తుంది.

More Bhakti Articles