భక్తులపై విషం ప్రభావం చూపలేదా ?

భక్తులపై విషం ప్రభావం చూపలేదా ?
భగవంతుడు తనని విశ్వసించిన వాళ్లని అనాథలను ... అభాగ్యులను చేయడు. ఏదో ఒక రూపంలో వాళ్లకి సహకరిస్తూ ఉంటాడు. వాళ్లకి ఆదరణను ... ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉంటాడు. తన భక్తులపై విషం సైతం ప్రభావం చూపకుండా ఆయన రక్షిస్తుంటాడు. ప్రహ్లాదుడు విషయంలోనే కాదు, జ్ఞానదేవుడి విషయంలోను ఇది మరోసారి నిరూపించబడింది.

నా అనే వాళ్లు లేకపోవడంతో తమని ఆదరించేవారి కోసం అన్వేషిస్తూ తన సోదరులతోను ... చెల్లితోను కలిసి బయలుదేరుతాడు జ్ఞానదేవుడు. ఆకలిని .. దాహాన్ని తట్టుకోవడానికి వాళ్లు దైవ నామస్మరణనే మార్గంగా ఎంచుకుంటారు. అలా వాళ్లు చాలాదూరం ప్రయాణించి ఓ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ లభించిన పండ్లతో ఆకలి తీర్చుకుంటారు.

దాహం కావడంతో అక్కడికి దగ్గరలో కనిపిస్తోన్న ఒక బావి దగ్గరికి వెళతారు. ఆ బావి గట్టున నిలబడి అందులోని నీటితో తనవాళ్ల దాహం తీరుస్తాడు జ్ఞానదేవుడు. ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు పరుగు పరుగున అక్కడికి వస్తారు. జ్ఞానదేవుడువాళ్లు ఆ నీటిని తాగడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు. చాలాకాలం క్రితమే ఆ బావిలోని నీళ్లు విషపూరితమయ్యాయని చెబుతారు.

అందువలన ఆ బావిలోని నీటిని తాగిన మనషులు ... పశువులు చనిపోవడం జరిగిందని అంటారు. ఈ కారణంగానే ఎంతో దూరం నడిచివెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నట్టు చెబుతారు. భయపడవలసిన పనిలేదనీ ... నిజానికి ఆ బావిలోని నీళ్లు ఎంతో రుచికరంగా వున్నాయని చెబుతాడు జ్ఞానదేవుడు. ఆ విషయం పట్ల వాళ్లకి నమ్మకం కలిగించడం కోసం, మరోమారు తాను తాగడమే కాకుండా వాళ్లతోను ఆ నీళ్లను తాగిస్తాడు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో వాళ్లంతా ఆనందాశ్చర్యాలకి లోనవుతారు.

జ్ఞానదేవుడి స్పర్శ కారణంగానే ఆ నీటిలో గల విషం విరుగుడు కాబడిందనీ, ఇక నీళ్ల విషయంలో గ్రామస్తులు ఇబ్బందులు పడవలసిన పనిలేదని అంటారు. ఇక మీదట తమ గ్రామంలోనే ఉండమనీ, వాళ్లకి అవసరమైనవన్నీ తాము సమకూరుస్తామని అంటారు. అలా భగవంతుడి దయవలన జ్ఞానదేవుడు వాళ్లకి ఆ గ్రామస్తుల ఆదరాభిమానాలు లభిస్తాయి. జ్ఞానదేవుడిలోని భక్తి పరిపక్వ దశకు చేరుకోవడానికీ, ఆయన కీర్తి ప్రతిష్ఠలు దశ దిశలా వ్యాపించడానికి ఆ గ్రామమే వేదిక అవుతుంది.

More Bhakti Articles