అందుకే ఆ గుడి నిర్మాణం పూర్తికాలేదట !

అందుకే ఆ గుడి నిర్మాణం పూర్తికాలేదట !
కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ అర్థాంతరంగా నిలిచిపోయిన కొన్ని నిర్మాణాలు కనిపిస్తూ వుంటాయి. అలా అక్కడి నిర్మాణాలు నిలిచిపోవడం వెనుక, ఒక్కో చోట ఒక్కో కారణం వినిపిస్తూ వుంటుంది. చిత్రంగా అనిపించే ఆ కారణాలు విన్నప్పుడు ఎవరైనా సరే ఆలోచనలో పడతారు. ఆ కారణాలను సమర్ధించడంగానీ ... వాటి వెనుక గల విశ్వాసాలను కొట్టిపారేయడంగాని చేయలేక సతమతమైపోతుంటారు.

అలాంటి పరిస్థితిని తీసుకువచ్చిన ఆలయం ఒకటి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది ... అదే 'బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం'. అన్ని కాలాల్లోను నిరంతరం నీరు ఊరే స్వయంభువు శివలింగం, ఈ క్షేత్ర విశిష్టతను ఆవిష్కరిస్తూ వుంటుంది. సువిశాలమైన ఇక్కడి ఆలయం ఆనాటి ప్రాచీనతను ప్రతిబింబిస్తూ వుంటుంది. అడుగడుగునా భారీతనాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో కొన్ని నిర్మాణాలు అసంపూర్ణంగా వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

కావాలనే ఆ నిర్మాణాలను పూర్తిచేయలేదనే విషయం తెలిసినప్పుడు, అందుకు గల కారణమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఆలయ నిర్మాణానికి పూనుకున్న ఆనాటి పుర ప్రముఖులు ... పండితులు, అత్యంత భక్తి శ్రద్ధలతో దానిని పూర్తి చేయడానికి కృషి చేయసాగారు. చాలావరకూ ఆలయ నిర్మాణం జరిగిపోయిన తరువాత, హఠాత్తుగా వాళ్లకి ఒక ఆలోచన వచ్చింది. ఈ క్షేత్ర నిర్మాణం కాశీ క్షేత్రానికి నమూనాగా ఉందనే ఆలోచన రాగానే వాళ్లంతా తీవ్రమైన ఆందోళన చెందారు.

కాశీ క్షేత్రం వంటి మరో క్షేత్రాన్ని తాము నిర్మించడమంటే, ఆ క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించినట్టు అవుతుందని భావించారు. కాశీ క్షేత్రం వంటి నిర్మాణం తాము కూడా చేయగలమనే అహంభావానికి పోయినట్టు అవుతుందని అనుకున్నారు. ఏ అరిష్టం జరగకముందే నిర్మాణాలు ఆపివేయాలని నిర్ణయించుకున్నారు. అలా అప్పట్లో అసంపూర్ణంగా నిలిపివేసిన నిర్మాణాలు, ఆనాటి సంఘటనకు ఆనవాళ్లుగా ఈనాటికీ ఇక్కడ కనిపిస్తూ వుంటాయి.

More Bhakti Articles