భక్తుడి కోసం దెబ్బలు తిన్న భగవంతుడు !

భక్తుడి కోసం దెబ్బలు తిన్న భగవంతుడు !
భగవంతుడికి సేవలు చేయడంలో భక్తులు ఎంతటి ఆనందాన్ని పొందుతారో, భక్తులకు సాయపడటంలో భగవంతుడు కూడా అంతే సంతోషాన్ని పొందుతాడు. ఓ రాత్రివేళ పురందరదాసుకి దాహం వేస్తే, పాండురంగడు మంచినీళ్లు తీసుకుని వచ్చి ఇస్తాడు. తుకారాం కాపలాగా వున్న పంట పూర్తిగా కాలిపోతే, తిరిగి అది పచ్చగా ఏపుగా పెరిగేలా చేస్తాడు. తన కోసం చేతులు కోల్పోయిన గోరాకుంభార్ కి సాయపడటం కోసం, మారువేషంలో ఆయన ఇంట్లో పనివాడిగా చేరతాడు. జ్ఞానదేవుడి దాహాన్ని తీర్చడం కోసం ఎండిపోయిన బావిలో గంగ పొంగేలా చేస్తాడు.

ఇలా అనుక్షణం తన భక్తులను భగవంతుడు కనిపెట్టుకుని ఉంటూ ఉంటాడు. వాళ్ల కోసం భగవంతుడు అవమానపడిన సందర్భాలు ... గాయపడిన సంఘటనలు లేకపోలేదు. ఏకనాథుడి విషయంలో స్వామి గాయపడిన తీరు భక్తుల పట్ల ఆయనకిగల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఏకనాథుడి భక్తి శ్రద్ధలు ... ఆయన రచనలు అక్కడి ప్రజలను కట్టిపడేస్తాయి. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు ప్రజలను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

దాంతో అదే గ్రామంలో మఠాన్ని నిర్వహిస్తూ అసలైన జ్ఞానిని తానేనంటూ విర్రవీగే సచ్చిదానందుడికి అసూయ కలుగుతుంది. ఏకనాథుడిని ఆ గ్రామం నుంచి తరిమేస్తేనే తప్ప తనకి మనుగడలేదనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. ఏకనాథుడిపై లేనిపోనివి ప్రచారంచేసి ఒక వర్గం ప్రజలను ఆయనపైకి ఉసిగొల్పుతాడు. వాళ్లంతా కలిసి ఒక్కసారిగా ఆయనపై దాడి చేస్తారు. అప్పటికే మారువేషంలో ఆయన వెంట వుంటోన్న పాండురంగడు ఒక్కసారిగా వచ్చి వాళ్లకి అడ్డుపడతాడు.

ఏకనాథుడికి తగలవలసిన దెబ్బలన్నీ కూడా పాండురంగడికే తగులుతాయి. అయినా ఆయన తన మహిమలు ప్రదర్శించకుండా తన భక్తుడి కోసం ఆ దెబ్బలను భరిస్తాడు. ఆ తరువాత అక్కడి ప్రజలు ఆ దొంగ స్వామీజీ నిజస్వరూపం తెలుసుకుని ఆయనకి బుద్ధి చెప్పేలా చేస్తాడు. నిజమైన భక్తులను తాను నీడలా అనుసరిస్తూనే ఉంటాననీ, వాళ్లకి హాని తలపెట్టే వాళ్లని శిక్షిస్తూనే ఉంటానని ఈ సంఘటన ద్వారా మరోమారు స్వామి నిరూపించాడు.

More Bhakti Articles