దీర్ఘకాలిక వ్యాధులు ఇక్కడ మాయం !

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిలో ఎంతటి సత్యం దాగుందో, వయసులో ఉండగానే పుణ్యక్షేత్రాలను చుట్టిరావాలనే మాటలోనూ అంతే సత్యం వుంది. ఎందుకంటే బాధ్యతలు తీరిపోగానే తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టాలని అనుకుంటారు. బాధ్యతలు తీరే సమయానికి అనారోగ్యాలు వెదుక్కుంటూ వస్తాయి. అప్పుడు దూరప్రయాణాలు చేయలేక, అనుకున్న క్షేత్రాలను దర్శించలేక బాధపడుతూ వుంటారు.

ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడేవాళ్లు తప్పనిసరిగా దర్శించుకోవలసిన పుణ్యక్షేత్రాలు కొన్ని లేకపోలేదు. అనారోగ్యంతో అంతదూరం వెళ్లేది అక్కడి దైవం ప్రసాదించే ఆరోగ్యం కోసమే. అయితే ఆరోగ్యంగా ... ఆనందంగా వున్నప్పుడు క్షేత్రాలను దర్శించడం వలన కలిగే అనుభూతి వేరు. అనారోగ్యంతో బాధపడుతూ స్వామివారి సన్నిధికి చేరుకోవడం వేరు. ఇలా ఆరోగ్యాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రాల జాబితాలో 'గురువాయూర్' ఒకటిగా కనిపిస్తుంది.

దేవతల గురువైన బృహస్పతి ... వాయుదేవుడి సహకారంతో ఇక్కడ కృష్ణుడి ప్రతిమను ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా కొన్ని క్షేత్రాల్లో నిద్రలు చేయడం వలన .. మరికొన్ని క్షేత్రాలలో ప్రదక్షిణలు చేయడం వలన వ్యాధులు నయమైపోతాయని చెబుతుంటారు. కానీ ఇక్కడి కృష్ణుడిని మనస్పూర్తిగా విశ్వసిస్తూ ఆయన దర్శనం చేసుకుంటే, వెంటనే ఫలితం కనిపిస్తుందని అంటారు.

కృష్ణుడి పైనే భారంవేసి, ఇకపై ఆయన సేవకే అధిక ప్రాధాన్యతను ఇస్తానని అనుకుంటే ఆయన మనసు వెన్నలా కరిగిపోతుందట. ఎంతటి సుదీర్ఘమైన వ్యాధి అయినా ఊహించని విధంగా నివారించబడుతుందట. ప్రాచీనకాలం నుంచి ఈనాటి వరకూ ఎంతోమంది భక్తులు అనారోగ్యాల బారి నుంచి విముక్తిని పొందిన సంఘటనలు ఇక్కడ కథలు కథలుగా వినిపిస్తూ వుంటాయి. మానసికపరమైన ... శారీరక పరమైన అనారోగ్యంతో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న ఎంతోమంది ఈ క్షేత్రంలోని స్వామివారి అనుగ్రహంతో తిరిగి ఆరోగ్యవంతులైనట్టు చరిత్ర చెబుతోంది.

ఇదే విషయాన్ని ప్రత్యక్షంగా ... అనుభవపూర్వకంగా చెప్పేవాళ్లు కూడా ఇక్కడ ఎంతోమంది కనిపిస్తుంటారు. కనుక అనారోగ్యంతో బాధపడుతోన్న వాళ్లు కాస్త ఓపిక చేసుకుని పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ క్షేత్రంలో అడుగుపెడితే, స్వామివారిని మించిన వైద్యుడు లేడనే విషయం అనతికాలంలోనే వాళ్లకి అర్థమైపోతుంది.


More Bhakti News