హనుమంతుడంటే అందరికీ ఇష్టమే

హనుమంతుడంటే అందరికీ ఇష్టమే
హనుమంతుడు జన్మించినతీరు ... ఆయన బాల్యచేష్టలు ... సీతారామలక్ష్మణులు క్షేమంగా అయోధ్యకి చేరుకోవడం వెనుక ఆయన పోషించిన పాత్రను ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేరు. బాల్యంలో తన అల్లరి చేష్టలతో మునిగణాలను ముక్కుమూసుకుని తపస్సు చేసుకోనీయకుండా చేసిన హనుమంతుడు, ఆ తరువాత మునిగణాలు ఆత్రుతతో ఎదురుచూసే లోక కల్యాణంలో కీలకమైన పాత్రను పోషిస్తాడు.

సూర్యుడిని పండులా భావించి పైకెగిరిన హనుమంతుడు, ఆ తరువాత అదే సూర్యుడి దగ్గర విద్యను అభ్యసిస్తాడు. గాలిలో ఎగరడానికి ఆయనకిగల వరమే, సీతాన్వేషణ సమయంలో సముద్రాన్ని దాటేందుకు ఉపయోగపడుతుంది. సీత ఆచూకి తప్పని సరిగా తెలుస్తుందని శ్రీరాముడిలో ఆశాభావాన్ని కలిగిస్తాడు. అలాగే లంకానగరానికి చేరుకొని, తనకంటే మహా బలవంతులైన వారితో శ్రీరాముడు త్వరలో అక్కడికి రానున్నాడంటూ ఆమెకి ధైర్యం చెబుతాడు.

దూతగా రావణుడికి విషయం స్పష్టం చేసి, రాముడి సైన్యంపై రావణుడి అంచనాలను పెంచుతాడు. అదే సమయంలో రావణ సైన్యానికి భయాందోళనలను కలిగిస్తాడు. వంశాన్ని కాపాడుకోవాలనే విభీషణుడి మనసు తెలుసుకుని, ఆయనని రాముడు ఆదరించేలా చేస్తాడు. ఇక యుద్ధం ప్రారంభమైన నాల్గవ రోజునే, రావణుడి కుడిభుజంగా చెప్పుకునే ఆయన సేనాని 'అకంపనుడు'ను హనుమంతుడు హతమారుస్తాడు.

మేఘనాథుడితో తలపడిన లక్ష్మణుడు కుప్పకూలిపోతే, సంజీవని పర్వతం తెచ్చి ఆయన్ని మామూలు మనిషిని చేస్తాడు. రామరావణ యుద్ధంలో ఎవరికీ వారు తమ రక్షణ చూసుకుంటూ శత్రువులను సంహరించసాగారు. కానీ హనుమంతుడు మాత్రం రామలక్ష్మణులను ఓ కంట గమనిస్తూనే శత్రువులను తుదముట్టిస్తాడు. యుద్ధం ముగిసిన తరువాత అక్కడితో ఆగిపోకుండా, రాముడితోనే తన జీవితం అనుకుంటూ ఆయన వెంటే అయోధ్యకి వస్తాడు.

అప్పటి నుంచి అనుక్షణం రామనామమే మంత్రంగా ... రాముడి సేవయే పరమార్థంగా భావిస్తాడు. పోతన ... తులసీదాస్ వంటి శ్రీరాముడి భక్తులకు ఆయన దర్శన భాగ్యం కల్పించడమే కాకుండా, వాళ్లు రాసిన ఆధ్యాత్మిక గ్రంధాలను సైతం రక్షిస్తూ వస్తాడు. అందుకే శ్రీరాముడు తాను తీర్చుకోలేనిది ఏదైనా వుందంటే, అది హనుమంతుడి రుణమేనని అన్నాడట. భగవంతుడిగా రాముడు లోకానికి ఆదర్శమైతే, భక్తుడిగా హనుమంతుడు ఆదర్శమై నిలిచాడు.

రామనామం వింటేనే మంచులా .. మైనంలా కరిగిపోయే హనుమంతుడిని పిల్లలు .. పెద్దలు అందరూ ఇష్టపడుతుంటారు. ఆయన ఆలయాలను దర్శించి తరిస్తుంటారు. ఇక కొన్ని ప్రాంతాలవాళ్లు చైత్రమాసపు పౌర్ణమి రోజున హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున హనుమజ్జయంతిని జరుపుతారు. శ్రీరాముడి సేవలో అలసిన ఆయనకి ప్రేమానురాగాలతో సేవలుచేసి తరిస్తారు.

More Bhakti Articles