భక్తులకు తన సన్నిధిలో చోటిచ్చే భగవంతుడు

భక్తులకు తన సన్నిధిలో చోటిచ్చే భగవంతుడు
భగవంతుడు ఎంతో గొప్పవాడు ... తాను ఎక్కడ వుంటే తన భక్తులు అక్కడ వుండాలని అనుకుంటాడు. తన భక్తులు ఎక్కడ వుంటే తాను అక్కడ వుండాలని ఆరాటపడతాడు. ఈ కారణంగానే ఎన్నో పుణ్యక్షేత్రాలలో భగవంతుడితో పాటు ఆయన భక్తుల మందిరాలు కూడా దర్శనమిస్తూ వుంటాయి. అయితే చాలామంది మహాభక్తులు భగవంతుడిని అనేక విధాలుగా కీర్తిస్తూ ఆయన మనసు గెలుచుకోవడం జరిగింది. ఆయన సన్నిధానంలో చోటు సంపాదించుకోవడం జరిగింది.

అయితే ఎలాంటి అక్షరజ్ఞానం లేని కన్నప్ప, అసమానమైన తన భక్తితో భగవంతుడి కృపకు పాత్రుడుకావడం, ఆయన క్షేత్రంలో స్థానం సంపాదించుకోవడం మనకి శ్రీకాళహస్తిలో కనిపిస్తుంది. పంచభూత లింగాలలో ఒకటిగా ఇక్కడ 'వాయులింగం' దర్శనమిస్తూ వుంటుంది. విశిష్టమైనటువంటి ఈ శివలింగాన్నే కన్నప్ప తన పరిజ్ఞానంమేరకు పూజించాడు. భగవంతుడి ఆకలి ... దప్పిక తీర్చడానికి నానాకష్టాలు పడ్డాడు.

ఏక్షణంలో స్వామికి ఏ అవసరం వస్తుందోనని ఆలోచించి, గూడానికి వెళ్లకుండా శివుడిని కనిపెట్టుకుని అక్కడే ఉండిపోయాడు. ఒకరోజున స్వామి కంటిలో నుంచి రక్తం ధారగా కారుతూ వుంటే, క్షణమైనా ఆలస్యం చేయకుండా బాణం మొనతో తన కన్ను తీసి శివలింగానికి పెడతాడు. రెండవ కన్నుకి కూడా అదే విధంగా రక్తం వస్తూ వుండటంతో తన రెండవ కన్నునూ ఆయనకి సమర్పిస్తాడు. అప్పట్లో అది .. పిలిస్తే పలికే నాథుడులేని మహారణ్యం. తన రెండు కళ్ళుపోతే అక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్లాలనే ఆలోచన కన్నప్పకి లేదు. శివుడు ప్రత్యక్షమై తిరిగి చూపును ఇస్తాడనీ ఆయన అనుకోలేదు.

శివుడి బాధను తొలగించాలనే ఒక ఒక ఆరాటం కారణంగానే ఆయన అంతటి త్యాగం చేశాడు. అచెంచలమైన భక్తి విశ్వాసాలే భగవంతుడి మనసును గెలుచుకుంటాయని ఈ లోకానికి చాటిచెప్పాడు ... శివభక్తులలో అగ్రగణ్యుడుగా నిలిచిపోయాడు. నిజమైన భక్తికి నిదర్శనంగా ఇక్కడి కొండపై కన్నప్ప మందిరం కనిపిస్తూ వుంటుంది. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించిన భక్తులు, స్వామి సన్నిధానానికి అతి చేరువలో గల కన్నప్ప మందిరాన్నికూడా దర్శిస్తూ వుంటారు. అసమానమైన ఆయన భక్తిని తలచుకుంటూ తరిస్తుంటారు.

More Bhakti Articles