గరుడపక్షిపై విష్ణుమూర్తి ఇక్కడికి వస్తాడట !

గరుడపక్షిపై విష్ణుమూర్తి ఇక్కడికి వస్తాడట !
రావణుడు అపహరించుకు వెళ్లిన సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణులు బయలుదేరుతారు. అలా వాళ్లు సుగ్రీవుడు నివసిస్తోన్న కొండ ప్రదేశానికి చేరుకుంటారు. సుగ్రీవుడితో రామలక్ష్మణులకు మైత్రీ సంబంధాన్ని కలిగించడంలో హనుమంతుడు ప్రధానమైన పాత్రను పోషిస్తాడు. సీతాదేవి ఆచూకీ తెలుసుకోవడానికి గాను బయలుదేరిన సుగ్రీవుడి సేన, ఒక ప్రదేశానికి చేరుకొని అక్కడి నుంచి నాలుగు బృందాలుగా విడిపోయి .. నాలుగు దిక్కులకు వెళుతుంది. ఈ కారణంగా ఈ ఊరుకి 'చదలవాడ' అనే పేరు వచ్చింది.

విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం ప్రకాశం జిల్లాలో విలసిల్లుతోంది. సీతాదేవి కనిపిస్తే .. తాను శ్రీరాముడి సేవకుడినని నమ్మించడం కష్టం కావచ్చనీ, అందువలన ఆమెకు చూపించడం కోసం ఉంగరం ఇవ్వమని రాముడిని కోరతాడు హనుమంతుడు. భార్యాభర్తల అన్యోన్యతకు ... అనురాగానికి ఉంగరం అద్దంపడుతూ వుంటుంది. ఆలుమగలు ధరించే ఆభరణాలలో ఉంగరానికి ఎంతో ప్రత్యేకత వుంది. అందువలన వాళ్లు ఒకరి ఉంగరాన్ని ఒకరు త్వరగా గుర్తించ గలుగుతారు, భాగస్వామి చెంతనే ఉన్నట్టుగా అనుభూతిని పొందుతారు.

ఈ విషయాన్ని గ్రహించిన రాముడు , హనుమంతుడి తెలివితేటలను అభినందిస్తూ ఆయనకి ఉంగరాన్ని ఇస్తాడు. హృదయాలను తాకే ఈ సంఘటన ఇక్కడే జరిగినట్టుగా స్థలపురాణం చెబుతోంది. రామాయణంలో మరిచిపోలేని ఘట్టాలలో ఇది ఒకటి. అందుకు గుర్తుగానే ఇక్కడ రామాలయం నిర్మించబడింది. ఇక మరో విశేషం ఏమిటంటే .. ప్రతియేటా శ్రీరామనవమి రోజున ఆయన కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉండగా, ఓ గరుడ పక్షి వచ్చి ప్రదక్షిణ క్రమంలో స్వామివారిని దర్శించి వెళుతుందట.

శ్రీమహావిష్ణువు ... రామావతారంలో తనకి జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి గరుడపక్షి పై ఇక్కడికి వస్తాడనీ, స్వామివారు అదృశ్య రూపంలో వుండటం వలన గరుడ పక్షి మాత్రమే కనిపిస్తూ ఉంటుందని చెబుతుంటారు. మహిమాన్వితమైన ఈ దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి పునీతులవుతుంటారు.

More Bhakti Articles