కళ్లను కట్టిపడేసే వేంకటేశ్వరుడి క్షేత్రం

కళ్లను కట్టిపడేసే వేంకటేశ్వరుడి క్షేత్రం
గోవా అనగానే అదొక అందమైన విహార స్థలంగానే అందరికీ గుర్తుకు వస్తుంది. అయితే ఇది అందమైన ప్రదేశమే కాదు ... భక్తిభావ పరిమళాలను వెదజల్లే ఆధ్యాత్మిక ప్రదేశం కూడా. విలాసవంతమైన ఈ నగరం, ఆధ్యాత్మిక చింతన కలిగినవారికి ఆలయాల నగరంగా దర్శనమిస్తుంది. ఇక్కడ ప్రాచీనకాలంనాటి ఆలయాలతో పాటు ఆధునికంగా నిర్మించబడిన అనేక ఆలయాలు కనిపిస్తూ వుంటాయి.

అలాంటి వాటిలో శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం ఒకటిగా చెప్పుకోవచ్చు. సువిశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయబడిన ఉద్యానవనం మధ్య భాగంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. వందలాదిమంది భక్తులు ఎలాంటి తోపులాటలు లేకుండా నిదానంగా ... ప్రశాంతంగా స్వామిని దర్శించుకునే అవకాశం వుంటుంది. చక్కని నగిషీలతో తీర్చిదిద్దబడిన ఈ ఆలయం ప్రతి ఒక్కరి మనసును కొల్లగొడుతుంది.

ఇక వేంకటేశ్వరస్వామి అనగానే గర్భాలయంలో నిండుగా ... కనుల పండుగగా కనిపించే సమ్మోహన రూపాన్నే అందరూ ఊహించుకుంటారు. అచ్చు అలాంటి రూపమే మనకి ఇక్కడి గర్భాలయంలో దర్శనమిస్తూ ఉంటుంది. వివిధ రకాల ఆభరణాలతో ... అనేక రకాల పూలమాలికలతో ఇక్కడి స్వామిని అలంకరిస్తూ వుంటారు. మనోహరంగా ... మంగళప్రదంగా కనిపించే స్వామివారిని చూస్తే నేత్రాలు పవిత్రమవుతాయి.

విహారార్థం గోవాకి వెళ్లినవాళ్లు, బాలాజీ మందిరం పేరుతో పిలవబడే ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. తమ విహారయాత్ర ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దుకున్నందుకు ఆనందపడిపోతారు. ఇక ఆలయంలో ఎటు చూసినా కనిపించే పచ్చదనం ... పరిశుభ్రత మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతతను ప్రసాదంగా అందించే ఈ ఆలయాన్ని చూసితీరవలసిందే.

More Bhakti Articles