ఈ కొండపై స్వామి ప్రత్యక్షంగా సంచరిస్తాడట !

 ఈ కొండపై స్వామి ప్రత్యక్షంగా సంచరిస్తాడట !
సంకల్ప మాత్రం చేతనే శ్రీమహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించి తాను భక్త రక్షకుడనని చాటిచెప్పాడు. ఆ తరువాత మహర్షుల మనవి మేరకు ... భక్తుల విన్నపం మేరకు అనేక ప్రదేశాల్లో స్వయంభువుగా ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో స్వామి తన అవతారకార్యానికి తగినట్టుగానే కొండగుహల్లో కొలువుదీరి కనిపిస్తుంటాడు.

స్వామి ఆవిర్భవించిన గుహలోకి ప్రవేశిస్తే అక్కడ ఎంతో ఉక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఉగ్రస్వరూపుడైన ఆయన శరీరం నుంచి వెలువడే శక్తి తరంగాలే ఇందుకు కారణంగా చెబుతుంటారు. చాలా క్షేత్రాల్లో ఉదయం వేళల్లోనే కాకుండా రాత్రి సమయాల్లోనూ భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. కానీ చీకటిపడితే చాలు భక్తులు కొండపైకి వెళ్లని క్షేత్రం ఒకటి వుంది ... అదే 'మళ్ళూరు మంగపేట'.

వరంగల్ జిల్లాలోని ఈ క్షేత్రంలో రాత్రి సమయాల్లో నరసింహస్వామి సింహ రూపంలో ఈ కొండపై సంచరిస్తాడని స్థానికులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. రాత్రి సమయాల్లో కొండపై నుంచి సింహం గర్జనలు వినిపిస్తూ ఉంటాయని అంటారు. అంతే కాకుండా కొండపై కొన్ని జంతువులను సింహ వేటాడిన గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయని చెబుతారు. స్వామి వారి సంచారానికి భంగం కలిగించకూడదనే ఉద్దేశంతోను ... ఆయనకి ఆగ్రహం కలిగించకూడదనే ఆలోచనతో ఆ సమయంలో కొండపైకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు.

దర్శనం వలన భక్తులకు ... అభిషేక సమయంలో స్పర్శ వలన అర్చకులకు ఇక్కడి స్వామి దివ్యమైన అనుభూతులను కలిగిస్తూ ఉంటాడని చెబుతుంటారు. నరసింహస్వామి ప్రత్యక్షంగా కొలువైన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఆ స్వామికి తమ మనసులోని కోరికలు మనవిచేస్తూ వుంటారు ... అవి నెరవేరగానే మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు.

More Bhakti Articles