నాగదేవత అనుగ్రహాన్ని ఎలా పొందాలి ?

నాగదేవత అనుగ్రహాన్ని ఎలా పొందాలి ?
వైకుంఠంలో శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుడిపై కొలువుదీరు కనిపిస్తుంటాడు. ఇక సదాశివుడు కైలాసంలో వున్నా ... భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ ప్రదేశాల్లో సంచరిస్తూ వున్నా ఆయన మెడలో నాగేంద్రుడు సహజ ఆభరణమై దర్శనమిస్తూ ఉంటాడు. అలా శివకేశవులతో నాగేంద్రుడు విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంటాడు.

ఇక సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంలో అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా కూడా సర్పజాతి ఆధ్యాత్మిక ప్రపంచంలో విశిష్టమైన స్థానాన్ని అలంకరించి విశేషమైన రీతిలో పూజలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో నాగేంద్రుడు ప్రధాన దైవంగా ఆవిర్భవించి అనేక ప్రాంతాల్లో భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు.

ఇక అటు వైష్ణవ సంబంధమైన ఆలయాలలోను .. ఇటు శైవ సంబంధమైన ఆలయాలలోను నాగేంద్రుడు కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు. ప్రధాన దైవాలను దర్శించుకున్న భక్తులు పరివారదేవతల వరుసలో కనిపించే నాగేంద్రుడిని తప్పనిసరిగా దర్శించుకుంటూ ఉంటారు. కొన్ని ఆలయాల్లో నాగేంద్రుడు జంటనాగుల రూపంలోనూ ... పంచపడగలతో ఏకశిలగాను ... పుట్ట రూపంలోనూ పూజలు అందుకుంటూ ఉంటాడు.

నాగేంద్రుడిని ఆరాధించడం వలన సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయనీ, అనారోగ్యాలు తొలగి ఆయుష్షు పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. సర్పదోషాల నుంచి విముక్తిని కలిగించి, సకల శుభాలను ప్రసాదించే నాగేంద్రుడిని అనునిత్యం ఆరాధించాలని అంటున్నాయి. నాగేంద్రుడికి నమస్కరిస్తూ ''నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీధర, నమస్తే సర్పనాగేంద్ర ఆదిశేష నమోస్తుతే'' అనే శ్లోకాన్ని పఠించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని పఠించడం వలన నాగేంద్రుడి అనుగ్రహం త్వరగా కలుగుతుందని చెప్పబడుతోంది.

More Bhakti Articles