అహంకారం వలన లభించేదేమిటి ?

అహంకారం వలన లభించేదేమిటి ?
అజ్ఞానంలో నుంచే అహంకారం పుడుతుంది ... అహంకారమే అవమానానికి కారణమవుతుంది. ఈ సత్యం అనేక మంది విషయంలో నిరూపించబడుతూ వచ్చింది. అయితే అహంకారంతో మిడిసిపడేవాళ్లు ఎదుటి వాళ్ల మాటలను పట్టించుకోరు. తమ మంచికోరే మంచి సూచన చేశారని అనుకోరు. తాము చేయవలసినది చేసి భంగపడినప్పుడు గాని వాళ్ల కళ్లు తెరుచుకోవు. అందువల్లనే ' తట్టు తగిలితేగానీ తత్త్వం బోధపడదు' అనే నానుడి పుట్టింది.

అహంభావం వల్లనే రావణుడు ... దుర్యోధనుడు ... శిశుపాలుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఒకడుగా 'దంభోద్భవుడు' అనే రాజు కనిపిస్తాడు. తన శౌర్య పరాక్రమాలపై ఈ రాజుకు అపారమైన నమ్మకం ఉండేది. దాంతో ఎంతసేపు ఎవరిపై పోరాటానికి వెళదామా అనే దాని గురించే ఆలోచన చేస్తూ ఉండేవాడు. తనని ఎదిరించే వాళ్లు లేరనే అహంభావం ఆయనలో అంతకంతకూ పెరిగిపోతూ ఉంటాడంతో అందరూ ఇబ్బంది పడసాగారు.

అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి నరనారాయణుల పేరు వినిపిస్తుంది. వాళ్లు సామాన్యులుకారనీ ... ఎంతటి పరాక్రమవంతులైనా వారి ఎదుట అపజయాన్ని అంగీకరించవలసిందేనని వింటాడు. అలాంటివారిని ఎదిరించి విజయం సాధించినప్పుడే తనలాంటి వారికి గౌరవం ఉంటుందని దంభోద్భవుడు అనుకుంటాడు. నరనారాయణులు ఎక్కడ ఉంటున్నది తెలుసుకుని అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ఆశ్రమ వాతావరణం ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ప్రశాంతమైన ఆ ప్రదేశంలో తపస్సు చేసుకుంటోన్న ఇద్దరు తాపసులు ఆయన కంటపడతారు.

అక్కడి ఆశ్రమంలో గల వారిని నరనారాయణుల గురించి అడుగుతాడు రాజు. ఆ తాపసులే నరనారాయణులని తెలుసుకుని బిత్తరపోతాడు. వాళ్ల గురించి తాను ఎంతో గొప్పగా ఊహించుకుంటూ వస్తే అందుకు పూర్తి భిన్నంగా వాళ్లు కనిపించడంతో నివ్వెరపోతాడు. తాను వస్తోన్న విషయం తెలుసుకుని భయంతో వాళ్లు అలా నటిస్తున్నారని అనుకుంటాడు. తన నుంచి తప్పించుకోవడం ఎవరివలన కాదంటూ, వారి తపస్సుకి భంగం కలిగిస్తాడు.

వాళ్ల శక్తి సామర్థ్యాల గురించి చాలా విన్నాననీ, నిజానిజాలు తేల్చుకుందామని వచ్చానని అంటాడు. ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటోన్న తమ దగ్గర పరాక్రమం గురించిన ప్రస్తావన చేయడం, యుద్ధానికి కాలుదువ్వడం సరికాదని ఆయనకి వాళ్లు నచ్చచెబుతారు. అయినా దంభోద్భవుడు వినిపించుకోకుండా తన దగ్గర గల ఆయుధాలను ప్రయోగించడం మొదలుపెడతాడు.

ఇక ఆయన దగ్గర హితవచనాలు పనిచేయవని భావించిన నరనారాయణులు కేవలం దర్భలు మాత్రమే ప్రయోగిస్తారు. వాటిని తన అస్త్ర శస్త్రాలు ఏమీ చేయలేకపోవడం చూసిన రాజు బిత్తరపోతాడు. చివరికి శక్తి హీనుడై వారి పాదాలపై పడి శరణుకోరతాడు. లోకంలో అహంభావంతో మిడిసిపడే వారికి అవమానమే ఫలితంగా దక్కుతుందని ఈ సంఘటన మరోమారు నిరూపించింది.

More Bhakti Articles