నిజంగానే సర్పయాగం ఇక్కడ జరిగిందా ?

నిజంగానే సర్పయాగం ఇక్కడ జరిగిందా ?
తెలంగాణ ప్రజలు భారీఎత్తున తరలివచ్చే జాతర్లలో ఏడుపాయల జాతర ఒకటి. మెదక్ జిల్లా సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. గోదావరి నదికి ఉపనదిగా చెప్పబడుతోన్న మంజీరానది ఇక్కడ ఏడు పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి ఏడు పాయలు అనే పేరు వచ్చింది. దుర్గాదేవి ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో పుణ్య నదీ జలాలుగా ఏడుపాయలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడుపాయలు ఇక్కడ ప్రవహించడం వెనుక పురాణ పరమైన కథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది.

పాముకాటు కారణంగా తన తండ్రి చనిపోవడం జనమేజయ మహారాజుకి తీవ్రమైన ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. భూలోకంలో పాము అనేది కనిపించకుండా ... ఆ మాట వినిపించకుండా చేయాలని ఆయన నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఆయన ఈ ప్రదేశంలో 'సర్పయాగం' తలపెడతాడు. ఆ మంత్ర శక్తి కారణంగా అన్నిరకాల సర్పాలు వచ్చి అగ్నికి ఆహుతి కాసాగాయి. సర్పాలు బూడిద కుప్పలుగా మారుతూ ఉండటంతో, ఆ రాసులు చిన్నపాటి గుట్టలను తలపించసాగాయి.

ఆ సర్పాల పరిస్థితి అత్రి .. వశిష్ఠ .. కశ్యప .. విశ్వామిత్ర .. జమదగ్ని .. గౌతమి .. భరద్వాజ మహర్షులకు ఆవేదనను కలిగిస్తుంది. వాటికి పుణ్యలోకాలను కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వాళ్లు గరుత్మంతుడి దగ్గర వ్యక్తం చేస్తారు. దాంతో గరుత్మంతుడు గంగాదేవిని ఈ ప్రదేశానికి తీసుకువస్తాడు. సప్తరుషులు కలిసి ఆ గంగను ఏడుపాయలుగా చేసి ఆ బూడిద రాసులపై నుంచి ప్రవహింపజేస్తారు. గరుత్మంతుడు ప్రార్ధన మన్నించి గంగాదేవి ఇక్కడికి వచ్చిన కారణంగానే 'గరుడగంగ' పేరుతో పిలవబడుతోంది.

నిజంగా ఈ ప్రదేశంలోనే 'సర్పయాగం' జరిగివుంటుందా ? అనే సందేహం చాలామంది వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వాళ్లు ఇప్పటికీ ఇక్కడి ఇసుక మేటల అడుగుభాగం నుంచి బయటపడుతోన్న బూడిదను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఈ బూడిద కలిసిన ఇసుక ఇప్పటికీ చేతికి వేడిగా తగులుతూ ఉండటం చూసి విస్తుపోతుంటారు. సర్పయాగం ఇక్కడే జరిగిందని చెప్పడానికి ఇంతకు మించిన ఆధారం ఏవుంటుందని మరికొందరు సమర్ధిస్తుంటారు. అలా ఈ క్షేత్రం జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన ప్రదేశంగా విశిష్టతను సంతరించుకుని, మహిమాన్వితమైన ప్రదేశంగా అలరారుతోంది.

More Bhakti Articles