బంగారపు అనుములు పండించిన భక్తురాలు !

బంగారపు అనుములు పండించిన భక్తురాలు !
నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన పుణ్యక్షేత్రాలలో 'మట్టపల్లి' ఒకటి. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ సమీపంలో గల ఈ క్షేత్రం గురించి తెలిసిన వారికి ఇక్కడి 'తంగెడ' గ్రామం గురించి కూడా తప్పకుండా తెలుస్తుంది. 'తంగెడ' గ్రామం ప్రత్యేకతను సంతరించుకుని కనిపించడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. చాలాకాలం క్రిందట, నరసింహస్వామికి పరమభక్తురాలైన 'భవనాశినీదేవి' ఈ గ్రామానికి చెందిన 'మాచిరెడ్డి' ఇంటికి కోడలుగా వచ్చింది.

ఆపదలో ... అవసరాల్లో ఆదుకునే వ్యక్తిగా ఆయనకి మంచి పేరుంది. ఆయనంటే ఆ గ్రామస్తులకు ఎంత గౌరవము ఉందో ... అంత భయమూ ఉండేది. భక్తిపరురాలైన భవనాశిని తన ఇంటి కోడలు కావడం మాచిరెడ్డికి ఆనందాన్ని కలిగించేది. ఒకరోజున మావగారి మాట మేరకు విత్తనాలుగా చల్లేందుకు అనుములను తీసుకుని పొలానికి బయలుదేరుతుంది భవనాశిని. మార్గమధ్యంలో కొందరు సాధువులు దానం కోరడంతో, ఆ అనుములను దానం చేస్తుంది.

అయితే ఈ విషయం మావగారికి తెలిస్తే ఏమంటాడోనని భయపడుతుంది. నరసింహస్వామిని మనసులో తలచుకుని, ఇసుకను అనుములుగా భావించి పొలంలో చల్లుతుంది. గట్టుమీద కూర్చున్న మావగారు, ఆమె అనుములే చల్లుతోందని అనుకుంటాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ పొలంలో అనుముల పంట పండుతుంది. పంట కోయడానికి వచ్చిన వాళ్లు బంగారపు అనుములు చూసి ఆశ్చర్యపోతారు. ఈ విషయం ఆ నోటా ఈ నోట అందరికీ తెలిసిపోవడంతో వాటిని చూడటానికి పరిసర గ్రామాలవాళ్లు కూడా వస్తారు.

కోడలు ద్వారా జరిగింది తెలుసుకున్న మావగారు, వాటిని స్వామి కార్యానికి ... ధర్మకార్యలకు వినియోగిస్తాడు. అప్పటి అనుముల సంఘటన నిజమేనని నిర్ధారించేలా, మచ్చుగా మిగిలిన ఒకటి రెండు బంగారు అనుములను ఇప్పటికీ ఇక్కడి వారి దగ్గర చూడవచ్చు. అసమానమైన భవనాశిని భక్తి శ్రద్ధల గురించి ఇప్పటికీ ఇక్కడ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

More Bhakti Articles