కోరికలు నెరవేర్చు కొండదేవర

కోరికలు నెరవేర్చు కొండదేవర
పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పారాయణాలు ... భజనలు అవసరం లేదు. ఆయనని మెప్పించడానికి ఎలాంటి పాండిత్యంతో పనిలేదు. నిజమైన ప్రేమతో సేవించలేగానీ, నిలువునా నీరై కరిగి భక్తుల హృదయాలను తాకుతుంటాడు. ఈ కారణంగానే అడవీ ప్రదేశాల్లో ఎక్కువగా ఆవిర్భవించి అక్కడి కొండప్రాంతం వారి కులదేవతగా పూజలందుకుంటూ ఉంటాడు.

అలా కొండ ప్రదేశంలో ఆవిర్భవించి ఆక్కడి వారితోనే కాకుండా, మహర్షులతో సైతం పూజలందుకున్న శివలింగం ఒకటి నిజామాబాద్ జిల్లా 'చిన్నకోడప్ గల్' లో కనిపిస్తుంది. వనవాసకాలంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రదేశానికి కూడా వచ్చారనీ, ప్రస్తుతం ఇక్కడ పూజలు అందుకుంటోన్న శివలింగం శ్రీరాముడు ప్రతిష్ఠించినదేనని చెబుతారు. ఆ తరువాత కాలంలో ఎంతోమంది మహర్షులు ... మునులు ఇక్కడి స్వామిని సేవించారని అంటారు.

ఈ ప్రాంతంలో కనిపించే పుట్టలను కూడా స్థానికులు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఒకప్పుడు తపస్సు చేసుకున్న మునులపై పెరిగిన పుట్టలుగా వీటిని చూస్తుంటారు ... వాటి పవిత్రతకు భంగం కలిగించకుండా కాపాడుతుంటారు. ఇక ఈ మునులే సర్పరూపంలో స్వామివారిని సేవిస్తూ ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇక్కడ తిరిగే సర్పాలకు కూడా వాళ్లు హాని తలపెట్టరు. ఒకప్పుడు అడవిగా కనిపించిన ఈ ప్రదేశం నేడు భక్తుల రాకపోకలకు అనుకూలమైనదిగా మారిపోయింది.

అప్పట్లో కొండప్రాంతం వాళ్లు మాత్రమే ఆరాధించిన దైవం నేడు అందరికీ దర్శనభాగ్యాన్ని కలిగిస్తున్నాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన దేవుడు .. సర్పరూపాల్లో మునుల ఆరాధనలు అందుకున్న దేవుడు .. కొండదేవరగా పాలు - తేనె ఆరగించిన దేవుడు కావడం వలన ఈ క్షేత్రం విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారిని కోరికలు నెరవేర్చు కొండదేవరగానే కొలుస్తుంటారు. ప్రతియేటా స్వామికి జాతర నిర్వహిస్తూ .. మొక్కుబడులు చెల్లిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

More Bhakti Articles