మనసున నిలిచే మహాదేవుడి క్షేత్రం

మనసున నిలిచే మహాదేవుడి క్షేత్రం
ఆద్యంత రహితుడిగా సమస్త దేవతలచే ... మహర్షులచే కొనియాడబడిన ఆదిదేవుడు, లింగరూపంలోనే భూమిపై ఆవిర్భవించాడు. లింగరూపంలో గల శివుడిని ఎవరైతే అభిషేకిస్తారో ... ఆరాధిస్తారో వాళ్లకి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మట్టి శివలింగం .. నల్లరాయి శివలింగం .. తెల్లరాయి శివలింగం .. బాణలింగం .. పటిక శివలింగం .. వెండి శివలింగం .. బంగారు శివలింగం పూజలు అందుకుంటూ వస్తున్నాయి.

ఇక ఈ క్రమంలోనే స్పటిక శివలింగ పూజ కూడా ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. అయితే స్పటిక శివలింగం గల ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన ఆలయం మనకి 'విజయనగరం'లో కనిపిస్తుంది. ఇక్కడి గర్భాలయంలో గల స్పటిక శివలింగం చక్కని పరిమాణాన్ని కలిగి ఉంటుంది. అభిషేకం అనంతరం ఈ శివలింగానికి పరమశివుడు పంచముఖాలతో కనిపించే ఇత్తడి తొడుగును తొడుగుతారు.

స్పటిక శివలింగం తేజస్సును భక్తులు వీక్షించడం కోసం, పొద్దుపోయిన తరువాత ఈ తొడుగును తీస్తారు. ఈ సమయంలో స్వామివారిని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. ఇదే ప్రాంగణంలో శ్రీ చక్రాకారాన్ని పోలిన వేదికపై అనేక స్పటిక శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఆది దేవుడి ఆత్మలింగాన్ని గుర్తుకు తెచ్చే ఈ స్పటిక శివలింగాలకు జరిగే పూజాభిషేకాలు అణువణువునా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి.

ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఇక్కడ ప్రత్యేక మందిరాలలో ఏర్పాటు చేయబడిన శివలింగాలు ఆలయ విశిష్టతకు అద్దం పడుతూ ఉంటాయి. శైవ సంబంధమైన పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. స్పటికలింగ రూపంలో ఇక్కడ కొలువైన శివయ్యను దర్శించి, మనసులోని కోరికను చెప్పుకుంటే అనతికాలంలోనే అది తీరిపోతుందని భక్తులు చెబుతుంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం మనసుకి కావలసినంత ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆలయ దర్శనం ఓ మధురమైన జ్ఞాపకంగా మనసులోనే నిలిచిపోతుంది.

More Bhakti Articles