రక్షించేవాడే రామచంద్రుడు

రక్షించేవాడే రామచంద్రుడు
శ్రీరామచంద్రుడు తన భక్తులను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అనేకమంది భక్తుల విషయంలో ఇది నిరూపించబడింది. రామభక్తుడైన తులసీదాస్ విషయంలోనూ ఇది మరోమారు స్పష్టం చేయబడింది. తులసీదాస్ ... రవిదత్తుడు ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తారు. తులసీదాస్ తన రచనల్లో వాడుక భాషను ఉపయోగించడాన్ని రవిదత్తుడు తప్పుపడుతూ ఉండేవాడు.

తులసీదాస్ పట్ల ఆయనకి గల అసూయే అందుకు కారణమని గురువు కూడా గ్రహించి, రవిదత్తుడిని మందలిస్తాడు. అయితే కాలంతో పాటే తులసీదాస్ పై రవిదత్తుడికి ద్వేషం పెరుగుతూ వస్తుంది. తులసీదాస్ అసమానమైన భక్తి శ్రద్ధలు ... 'రామచరిత మానస్' కారణంగా ఆయన పొందుతోన్న కీర్తిప్రతిష్ఠలను రవిదత్తుడు సహించలేకపోతాడు. తులసీదాస్ రచించిన గ్రంధాన్ని అపహరించుకుని రమ్మంటూ ఓ రాత్రివేళ తన అనుచరుడిని పంపిస్తాడు.

ఆశ్రమంలో తులసీదాస్ నిద్రపోతుండటం చూసి లోపలికి ప్రవేశించడానికి అనుచరుడు ప్రయత్నిస్తాడు. ద్వారంలో శ్రీరామచంద్రుడు నుంచుని ఉండటం చూసి ఆలోచనలో పడతాడు. భయం వలన తనకి కలిగిన భ్రమగా భావించి లోపలికి వెళ్లబోతాడు. తన కాలు కదలకపోవడం ... అడుగు ముందుకు పడకపోవడం చూసి కంగారుపడిపోతాడు. తన కాలుకి ఏదో తాడు వంటిది చుట్టుకుని ఉండటం గమనించి, దానిని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది హనుమంతుడి తోక అనే విషయాన్ని గ్రహించడానికి ఆయనకి కొంతసేపు పడుతుంది.

ఎదురుగా తాటిచెట్టులా నుంచుని ఉన్న హనుమంతుడిని చూసి ఆయన బిత్తరపోతాడు. ఇక పై తులసీదాస్ జోలికి రాననీ, తనని మన్నించమంటూ ప్రాధేయపడతాడు. రాముడిని చూసి కూడా ఆయన అడుగుముందుకు వేయడం తనకి అస్సలు నచ్చలేదంటూ హనుమంతుడు ఆయన వైపు కదులుతాడు. అంతే ఆ భయానికే రవిదత్తుడి అనుచరుడు అక్కడే కుప్పకూలిపోతాడు. అలా శ్రీరామచంద్రుడు తన భక్తుడైన తులసీదాస్ ను ... ఆయన రచించిన 'రామచరిత మానస్' ను రక్షిస్తాడు. ధర్మం తప్పిన వారిపట్ల రాముడు దయచూపడని మరోమారు నిరూపిస్తాడు.

More Bhakti Articles