భక్తుల మనసుదోచే భద్రాచలం

భక్తుల మనసుదోచే భద్రాచలం
సీతారాముల కళ్యాణ మహోత్సవం అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రం 'భద్రాచలం'. సీతారాములకు ఈ ప్రదేశంతో విడదీయరాని సంబంధము .... అనుబంధము ఉన్నాయి. భద్రుడు అనే భక్తుడి కోరికమేరకు సీతారాములు ఇక్కడ ఆవిర్భవించడం వలన ... వారి వనవాస కాలంలోని అతిముఖ్యమైన ఘట్టాలకు ఈ ప్రదేశం వేదికగా ఉన్నందు వలన ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణానికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో విశిష్టత వుంది.

శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి నివాస స్థలమైన వైకుంఠమే ఈ'భద్రగిరి'యనీ .. 'విరజానది' గోదావరిగా పరుగులు తీస్తోందనేవారు లేకపోలేదు. శ్రీరాముడు ... నారాయణుడుగా చతుర్భుజాలతో ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే దర్శనమిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడి రాముడిని ... వైకుంఠ రాముడనీ, రామనారాయణుడని పిలుస్తుంటారు. భద్రుడిని త్వరగా అనుగ్రహించాలనే తొందరతో రావడం వలన స్వామివారి శంఖు చక్రాలు అపసవ్యంగా కనిపిస్తుండటం ఇక్కడి విశేషం. భద్రాచలం పరిసర ప్రాంతాలన్నీ కూడా సీతారామలక్ష్మణులకు సంబంధించిన ఘట్టాలను నేటికీ కళ్ల ముందుంచుతుంటాయి.

సీతమ్మవారు స్నానం చేసిన ఉష్ణగుండం ... పసుపు - కుంకుమలు ధరించడానికి ఆమె ఉపయోగించిన రాళ్లు ... నారచీర ఆరవేసుకున్న చోటు నేటికీ కనిపిస్తుంటాయి. ఇక సీతను రావణుడు అపహరించడానికి వచ్చిన ప్రదేశంగా 'రావణ గుట్ట' .. సీతారాములు నివసించిన 'పర్ణశాల' .. లక్ష్మణుడు కాపలాగా ఉన్న 'లక్ష్మణగుట్ట' .. రావణుడితో జటాయువు అనే పక్షి పోరాడిన ప్రదేశంగా 'జటపాక'.. ఆ పోరాటంలో దాని రెక్క తెగిపడిన ప్రదేశంగా 'రేకపల్లి' ఆనాటి ఘట్టాలకు ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి.

రామాయణంలోని కొన్ని ఘట్టాలకు దృశ్య రూపంగా ఈ ప్రదేశం కనిపించడం, భద్రుడి కోరికమేరకు సీతారామలక్ష్మణులు ఇక్కడ ఆవిర్భవించడం ... మరో మహా భక్తుడైన కంచర్ల గోపన్న స్వామివారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం భద్రాచలం విశిష్టతను చాటిచెబుతున్నాయి. పోకల దమ్మక్కకు తన జాడను తెలుపడం ... గోపన్నలోని భక్తి భావాలను మేల్కొల్పడం ... తన కారణంగా కారాగారంపాలైన గోపన్నను విడిపించడం ఇక్కడి రాముడి మహిమలుగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్లనే 'శ్రీరామనవమి' రోజున భద్రాచలం భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది.

శ్రీరాముడు నవమి రోజున జన్మించాడు ... ఆయన పట్టాభిషేక మహోత్సవం కూడా నవమి రోజునే జరిగిందని అంటారు. ఈ కారణంగానే గోపన్న ఇక్కడ స్వామివారి కల్యాణం 'చైత్ర శుద్ధ నవమి' రోజున జరపడం ప్రారంభించాడని చెబుతారు. ఇదే సమయానికి అన్ని గ్రామాలలోని వైష్ణవ ఆలయాలలోను స్వామివారికి కళ్యాణోత్సవాలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఇక రామదాసుగా ప్రసిద్ధి చెందిన గోపన్న చేయించిన ఆభరణాలే స్వామివారికీ ... అమ్మవారికి ప్రధాన అలంకారాలుగా దర్శనమిస్తూ ఉంటాయి.

భక్తజన సమూహమనే సరస్సులో విరిసిన తామరలా ఇక్కడి కళ్యాణ మంటపం కనిపిస్తుంటుంది. వేదికపై పూలజడతో సీతమ్మను ... బుగ్గన చుక్కతో రామయ్యను చూస్తే పరవశించని మనసుంటుందా ? ... ఆనందబాష్పాలు వర్షించని కనులుంటాయా ? భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం వలన, వివాహ యోగం ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ రోజున స్వామివారి కల్యాణోత్సవం తిలకించి ఆ అక్షింతలను తలపై ధరించిన భక్తులు, స్వామివారి భజనలు చేస్తూ జాగరణ చేయడం వలన సకలశుభాలను పొందుతారు.

More Bhakti Articles