సముద్రుడి పై ఆగ్రహించిన శ్రీరాముడు

సముద్రుడి పై ఆగ్రహించిన శ్రీరాముడు
సీతాన్వేషణ కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని వచ్చిన హనుమంతుడు, ఆమె లంకానగరంలో కాపలాదారులైన రాక్షసుల మధ్య ఉందని రాముడితో చెబుతాడు. దాంతో రాముడు వానరసేనతో ముందుకుసాగుతాడు. అయితే వానరులందరినీ ఒకటే ఆలోచన తొలిచేస్తూ ఉంటుంది. హనుమంతుడు వాయునందనుడు కనుక, ఆకాశ మార్గాన ప్రయాణించే విద్య తెలిసినవాడు కనుక సముద్రాన్ని దాటి లంకానగారానికి వెళ్లివచ్చాడు. మరి తామంతా సముద్రాన్ని ఎలా దాటడం అనే విషయాన్ని చర్చించుకుంటూనే సముద్ర తీరానికి చేరుకుంటారు.

శ్రీరాముడు ఏం చేయనున్నాడో ... తమని ఏమని ఆదేశించనున్నాడోనని అంతా ఆసక్తితో ఎదురుచూడసాగారు. సముద్రాన్ని దాటే శక్తిని తమకి ప్రసాదించవలసిందిగా శివుడిని ప్రార్ధించిన శ్రీరాముడు, ఆ తరువాత తమకి దారిని ఇవ్వవలసినదిగా సముద్రుడిని కోరతాడు. అయినా సముద్రంలో కెరటాల ఉధృతి తగ్గకపోవడం ... దారి ఏర్పడకపోవడం రాముడికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో అత్యంత శక్తిమంతమైన బాణాన్ని సముద్రుడి పైకి ఎక్కుపెట్టి, సముద్ర జలాలను రెండుగా చీల్చడానికి సిద్ధపడతాడు.

శ్రీరాముడి ప్రశాంతతను మాత్రమే ఎరిగిన వానరసేనలు కూడా ఆయన ఆగ్రహావేశాలను చూసి ఆందోళన చెందుతారు. భయపడిపోయిన సముద్రుడు ... శ్రీరాముడికి నమస్కరిస్తూ ఆయన్ని సమీపిస్తాడు. తాను దారి ఇవ్వడం అత్యంత శ్రమతో కూడుకున్న పనియనీ, తనపై వారథి నిర్మిస్తే అది దెబ్బతినకుండా కాపాడగలనని మాట ఇస్తాడు. రాముడి సేనావాహినిలో 'నీలుడు' ఒకడు. నిర్మాణపు పనుల్లో ఆరితేరిన 'నీలుడు' ... సేతువు నిర్మాణం తాను చేపడతానని రాముడితో అంటాడు.

ఈ విషయంలో నీలుడికి సహకరిస్తూ ఆయన అడిగినవి వెంటనే ఏర్పాటు చేయమని చెబుతాడు శ్రీరాముడు. నీలుడు చూపిన మార్గంలో కెరటాల ఉధృతి లేకుండా చూస్తుంటాడు సముద్రుడు. వానర వీరులంతా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ సేతువు నిర్మాణంలో పాలుపంచుకుంటారు. అలా నూరు యోజనాల పొడవున సేతువు నిర్మించి, దాని మీదుగా ప్రయాణించి శ్రీరాముడి సేన లంకానగరానికి చేరుకుంటుంది. రావణుడితో సహా అతని సేనలను అంతమొందించి, సీతాదేవిని వెంటబెట్టుకుని వెనుదిరుగుతుంది.

More Bhakti Articles