ఏడుకొండలస్వామి అనుగ్రహం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శిస్తూ ... ధ్యానిస్తూ తన జీవితాన్ని ఆయన సేవకే అంకితం చేసిన మహాభక్తురాలు ' శ్రీ తరిగొండ వెంగమాంబ'. ఆరంభంలో ఆమెను అక్కడి నుంచి తరిమేయాలని కొంతమంది ప్రయత్నించి, సాక్షాత్తు ఆ వేంకటేశ్వరుడే సదా ఆమెను రక్షిస్తూ ఉన్నాడని గ్రహించి మౌనం వహిస్తారు. ఇక ఆ స్వామి అలంకారాన్ని గురించి ... ఆనందాన్ని గురించి తప్ప వెంగమాంబకి మరోధ్యాస వుండేది కాదు.

అనునిత్యం ఆమె కృతులను వింటూ స్వామి మురిసిపోయేవాడు ... పరవశించిపోయేవాడు. అలాంటి పరిస్థితుల్లోనే 'వేంకటాచల మహాత్మ్యం' గురించి రాయాలని వెంగమాంబ అనుకుంటుంది. ప్రకృతి పరిణామ క్రమంలో భాగంగానే ఏడుకొండలు ఏర్పడ్డాయనీ, ప్రకృతి ప్రియుడైన స్వామి అక్కడ ఆవిర్భవించాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారందరికీ వేంకటాచల మహాత్మ్యాన్ని గురించి తెలియజెప్పాలని వెంగమాంబ సంకల్పించుకుంటుంది.

ప్రత్యక్షంగా తాను దర్శించిన ఏడుకొండల విశిష్టతను ... వేంకటాచలపతి మహిమలను ప్రస్తావిస్తూ ఆమె 'వేంకటాచల మహాత్మ్యం' రాస్తుంది. అణువణువునా ఆధ్యాత్మిక భావాలను వెదజల్లే ఆ గ్రంధాన్ని వేంకటేశ్వరస్వామికి అంకితం చేయాలనుకుంటుంది. ఆ గ్రంధాన్ని తీసుకుని ఆమె ఆనందనిలయానికి చేరుకుంటుంది. పద్మావతీదేవి సమేతంగా వెంగమాంబకి దర్శనమిచ్చిన శ్రీనివాసుడు, ఆమె రచించిన గ్రంధాన్ని స్వీకరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలా ఆ మహాభక్తురాలి జీవితం చరితార్థమవుతుంది.


More Bhakti News