ఉదయం మాత్రమే ఈ స్వామిని దర్శించాలట !

ఉదయం మాత్రమే ఈ స్వామిని దర్శించాలట !
హిరణ్యకశిపుడు వంటి రాక్షసుడికే నరసింహస్వామిని చూసి గుండె ఆగిపోయినంత పనైంది. ఇక భక్తుడైన ప్రహ్లాదుడికి కూడా భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. అలాంటి స్వామి విగ్రహరూపంలో ఉన్నప్పటికీ నేరుగా ఆయనని చూడటానికి కొంతమంది జంకుతుంటారు. ఈ కారణంగానే స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా శాంతమూర్తిగా అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. దాంతో భక్తులు ఉదయం ... సాయంత్రం వేళల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.

అయితే ఒకే ఒక ఆలయంలో మాత్రం స్వామివారిని భక్తులు ఉదయం వేళలో మాత్రమే దర్శించుకుంటూ ఉంటారు. ఆ ఆలయం గల క్షేత్రమే 'మల్లూరు మంగపేట'. ఈ క్షేత్రం వరంగల్ జిల్లాలోని ఖమ్మం - భద్రాచలం రహదారికి సమీపంలో అలరారుతోంది. ఇక్కడి కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించాడు. అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, ఎన్నో విశేషాలకు ... మహిమలకు నెలవుగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు.

గర్భాలయంలో స్వామివారి మూర్తిని చూడాలంటే కాస్తంత గుండె ధైర్యం కావలసిందే. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైనట్టుగా ఆయన ప్రతిమ మెత్తగా ఉంటుందని, అభిషేకం చేసే అర్చకులు చెబుతుంటారు. ప్రతినిత్యం స్వామివారిని నువ్వులనూనెతో అభిషేకించడం ఇక్కడి విశేషం. ఉదయమంతా భక్తులతో సందడిగా కనిపించిన కొండ పైభాగం, పొద్దుపోయిన తరువాత నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ సమయంలో కొండపైకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు.

పొద్దుపోయిన తరువాత స్వామివారు కనిపించే తీరు వేరుగా ఉంటుందనీ, రాత్రి సమయాల్లో అప్పుడప్పుడు కొండపై నుంచి సింహ గర్జనలు వినిపిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. సింహరూపంలో స్వామివారు అక్కడ తిరుగాడిన ఆనవాళ్లు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటారు. ఈ కారణంగానే స్వామివారిని కేవలం ఉదయంవేళలో మాత్రమే దర్శించుకుంటూ ఉంటారు. నియమ నిష్ఠలతో స్వామివారిని సేవించాలేగాని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles