దేవతలు దిగివచ్చేలా చేసిన పాతివ్రత్యం

దేవతలు దిగివచ్చేలా చేసిన పాతివ్రత్యం
అనసూయాదేవి శిష్యురాలైన నర్మదాదేవి నిస్సహాయురాలైన తన భర్త క్షేమాన్ని ఆశిస్తూ అనేక పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త ... ఆకలి బాధతో ఒక మహర్షి తపస్సుకి భంగం కలిగించి ఆయన ఆగ్రహానికి లోనవుతాడు. సూర్యుడు ఉదయించగానే ఆయన మరణిస్తాడని ఆ మహర్షి శపిస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నర్మదాదేవి, జరిగినది తెలుసుకుని కుప్పకూలిపోతుంది.

సూర్యోదయంకాగానే తమకి శాశ్వతమైన ఎడబాటు కలగనుందని ఆమె భర్త దుఃఖిస్తుంటాడు. పంచభూతాలు సైతం తమని విడదీయలేవని భర్తకు ఆమె ధైర్యం చెబుతుంది. పతివ్రతా ధర్మాన్ని తాను అతిక్రమించనిది నిజమే అయితే ఉదయించవద్దని సూర్యుడిని కోరుతుంది. దాంతో సూర్యుడు ఉదయించడం మానుకోవడం ... ముల్లోకవాసులు అయోమయానికి గురికావడం జరిగిపోతాయి.

ఊహించని ఈ సంఘటన త్రిమూర్తులకు ... త్రిశక్తి మాతలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జరిగిన సంఘటనకి అనసూయాదేవి శిష్యురాలు కారకులని గ్రహిస్తారు. సమస్త దేవతలు భూలోకంలోని నర్మద చెంతకు చేరుకుంటారు. ఉదయించడానికి సూర్యుడికి అనుమతిని ఇవ్వమని కోరతారు. సూర్యోదయంతో తన భర్త ప్రాణాలు ముడిపడి ఉన్నాయి కనుక అందుకు తాను అంగీకరించనని నర్మద తేల్చి చెబుతుంది. ఇక ఆమె అనసూయ మాట మినహా మరెవరి మాట వినదని గ్రహించి, అనసూయాదేవికి కబురుచేస్తారు.

సమస్త జీవులు అంధకారంలో అలమటిస్తూ ఉన్నాయనీ, సూర్యోదయానికి అంగీకరిస్తే ఆమె మాంగల్యానికి తాను రక్షణగా ఉంటానని నర్మదకి అనసూయాదేవి మాటయిస్తుంది. నర్మద సమ్మతించగానే సూర్యోదయం కావడం ... ఆమె భర్త మరణించడం జరిగిపోతాయి. దాంతో అనసూయాదేవి పార్వతీ పరమేశ్వవరులను ప్రార్ధించి, నర్మద భర్తను బతికిస్తుంది. ఆనందంతో ఆ దంపతులు అనసూయ - అత్రి మహర్షి దంపతుల ఆశీస్సులు తీసుకుంటారు.

More Bhakti Articles