శివుడుతో అర్జునుడు తలపడిన ప్రదేశం

శివుడుతో అర్జునుడు తలపడిన ప్రదేశం

శివుడుతో అర్జునుడు తలపడిన ప్రదేశం
పరమశివుడిని మెప్పించి ఆయన నుంచి అత్యంత శక్తిమంతమైన పాశుపతాస్త్రాన్ని పొందాలని అర్జునుడు నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా అందుకు తగిన ప్రదేశాన్ని ఎంచుకుని శివుడిని గురించి తపస్సును చేయడం మొదలుపెడతాడు. అర్జునుడి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శివుడు ఆయనని అనుగ్రహించాలని అనుకుంటాడు.

అయితే పాశుపతాస్త్రాన్ని పొందేవారు మహా పరాక్రమవంతులై ఉండాలి. అందువలన అర్జునిడిని శివుడు పరీక్షించాలని అనుకుంటాడు. ఒక అడవిపందిని సృష్టించి అర్జునుడు ధ్యానం చేసుకుంటోన్న ప్రదేశానికి పంపిస్తాడు. తపస్సుకి భంగం కలిగించిన పందిపై అర్జునుడు బాణం ప్రయోగిస్తాడు. అదే సమయానికి బోయవాడి వేషంలో శివుడు కూడా బాణం ప్రయోగిస్తాడు. దాని విషయంలో ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది.

అర్జునుడి శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా చూసిన శివుడు ఆయనకి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఇంతటి విశేషమైన సంఘటన జరిగిన ప్రదేశమే 'సలేశ్వరం'గా చెప్పబడుతోంది. నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రంలో శివుడు సలేశ్వరుడుగా కొలవబడుతుంటాడు. కొండలు ... గుహలు ... జలపాతాలతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రదేశాన్ని చూడగానే, ఇది మహిమాన్వితమైన క్షేత్రమనే విషయం అర్థమైపోతుంది.

శివుడితో అర్జునుడు తలపడిన ప్రదేశం ఇదేనని తెలిసినప్పుడు నమ్మకుండా ఉండలేం. ఎందుకంటే అందుకు తగిన వాతావరణమే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సహజమైన జలధారలతో అనునిత్యం అభిషేకించబడుతూ, అర్జునుడిని అనుగ్రహించిన శివుడిని దర్శించుకునేందుకు భక్తులు బృందాలుగా ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. మహాశివుడి లీలా విశేషాలను గురించి చెప్పుకుని తరిస్తుంటారు.

More Bhakti Articles