ఇప్పటికీ వాల్మీకి మహర్షిని చూడవచ్చట !

ఇప్పటికీ వాల్మీకి మహర్షిని చూడవచ్చట !
ఆధ్యాత్మిక చింతనతో తరించే వారి మనసుల్లో శ్రీరామచంద్రుడు ఉన్నంతవరకూ వాల్మీకి మహర్షి ఉంటాడు. కృతయుగానికి చెందినవాడిగా చెప్పబడుతోన్న వాల్మీకి మహర్షిని గురించి విని ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆయన ఛాయామాత్రంగా ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాడని తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోకతప్పదు.

అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే ప్రదేశం మనకి చిత్తూరు జిల్లా వాయల్పాడులో కనిపిస్తుంది. వాల్మీకి మహర్షితో గల సంబంధం కారణంగానే ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. అడవులకు పంపించబడిన సీతకు ఆశ్రయం కల్పించడంలోను ... శ్రీ రామచంద్రుడి ఔన్నత్యాన్ని తెలుపుతూ ఆమెకి ధైర్యం చెప్పడం లోను ... లవకుశులకు విద్యాబుద్ధులు చెప్పడంలోను వాల్మీకి మహర్షి ప్రధానమైన పాత్రను పోషిస్తూ వచ్చాడు.

అలాంటి వాల్మీకితో విడదీయరాని అనుబంధాన్ని కలిగినదిగా ఇక్కడి సీతారామాలయం కనిపిస్తుంది. ఇక ఈ క్షేత్రంలో సీతారాములు చూపే మహిమల సంగతి అటుంచితే, వాల్మీకి మహర్షి ఛాయా మాత్రంగా దర్శనమిస్తూ ఉంటాడని స్థానికులు చెబుతుంటారు. ప్రతి రోజూ కూడా సూర్యుడు అస్తమిస్తోన్న సమయంలో, ఇక్కడి గుట్టపై ఒక నీడ పడుతుంటుంది.

ఈ నీడ ఆకారం అచ్చు మహర్షిని తలపిస్తూ ఉంటుంది. దాంతో ఇది వాల్మీకీ మహర్షి నీడగానే భక్తులు భావిస్తుంటారు. మహిమాన్వితమైన ఈ దృశ్యాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. చాయామాత్రంగా కనిపించే వాల్మీకి మహర్షికి వినయపూర్వక నమస్కారాలు తెలుపుకుని వెళుతుంటారు.

More Bhakti Articles