గజేంద్రమోక్షం ఇక్కడే జరిగిందట !

గజేంద్రమోక్షం ఇక్కడే జరిగిందట !
గజేంద్రమోక్షం పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసాచల క్షేత్రంలో జరిగిందని అక్కడి స్థలపురాణం చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా అక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడి గజేంద్ర పర్వతం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే అసలు గజేంద్ర మోక్షం జరిగింది తమ గ్రామంలోనేనని 'కోగిలవాయి' గ్రామస్తులు చెబుతుంటారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది.

అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో శ్రీదేవి - భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశవస్వామి దర్శనమిస్తుంటాడు. ఇక్కడి గుట్టపై భాగంలో గల ఒక రాతిబండ కింద స్వామివారు ఆవిర్భవించాడు. ఈ గుట్ట చాలా విశాలమైన ప్రదేశంలో విస్తరించి కనిపిస్తుంది. గుట్ట పై భాగంలోనే ఏడు కోనేర్లు కనిపిస్తాయి.

ఇందులో ప్రధామైనదిగా చెప్పబడే కోనేరు చాలా లోతైనదిగా చెబుతుంటారు. ఇది ఎంతలోతు ఉందనేది తెలుసుకోవడానికి ఇంతవరకూ ఎవరూ సాహసించకపోవడం విశేషం. ఈ కోనేరులోకి దిగిన ఏనుగు కాలును మొసలి పట్టుకుందనీ, ఆ బాధను తట్టుకోలేక గజేంద్రుడు చేసిన ఆర్తనాదాన్ని విని శ్రీమహావిష్ణువు వచ్చి రక్షించాడని అంటారు. ఆ ఆదుర్దాలోనే స్వామివారి శంఖు చక్రాలు తారుమారయ్యానని చెబుతుంటారు. ఇదే విషయం ఇక్కడి శాసనాలలోనూ కనిపిస్తుంది.

వైకుంఠంలో స్నానమాచరించిన శ్రీమహావిష్ణువు, తన జుట్టును ముడి వేసుకోబోతుండగా గజేంద్రుడి ఆర్తనాదం వినిపించిందనీ, దాంతో ఉన్నపళంగా స్వామి అలాగే వచ్చేశాడని స్థలపురాణం చెబుతుంది. అందుకు తగిన విధంగానే స్వామి మూర్తి కనిపిస్తుంది. మాచర్ల ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు ముందుగా ఇక్కడి స్వామిని గుర్తించాడని చెబుతారు. కాకతీయుల కాలంలో వారి సామంత రాజైన రేచర్ల రుద్రుడు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి.

ఏనుగును కాపాడటానికి వచ్చి ఇక్కడే ఉండిపోయిన చెన్నకేశవుడుని స్థానికులకు తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను ... సిరిసంపదలను ఇక్కడి స్వామి ప్రసాదిస్తాడని విశ్వసిస్తూ అనుదినమూ అర్చిస్తుంటారు. గజేంద్రమోక్షం ఎక్కడ జరిగి ఉంటుందనే విషయాన్ని పక్కనే పెడితే, మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూసితీరవలసిందే.

More Bhakti Articles