చదువులో రాణించాలంటే ఎవరిని ప్రార్ధించాలి ?

జీవితంలో విద్యకిగల ప్రాధాన్యత మరి దేనికీ లేదని పెద్దలు చెబుతుంటారు. ధనవంతులు స్థానికంగా మాత్రమే గుర్తింపును పొందుతుంటారు. విద్యావంతులు అన్ని దేశాల్లోను గుర్తింపును పొందుతారని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. చదువు ... పామరుడిని పండితుడిని చేస్తుంది. సమాజంలో తగిన గౌరవాన్ని కల్పిస్తుంది ... కీర్తి ప్రతిష్ఠలను కలిగిస్తుంది. ఈ కారణంగానే తల్లి దండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు.

సాధారణంగా ధనవంతుల పిల్లల కన్నా పేదవారి పిల్లలు ఎక్కువగా చదువులో రాణిస్తుంటారు. దాంతో చదువుల తల్లికి పేదవారిపై ప్రేమ ఎక్కువని అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ధనవంతుల పిల్లల్లో కొంతమందికి వ్యాపకాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన వాళ్లు చదువుపై మనసుపెట్టే సమయం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే వాళ్లు చదివే విషయంలో కాస్త వెనుకబడుతుంటారు.

ఇక కొంతమంది పిల్లలను చూడగానే వాళ్లలో దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. ముఖ వర్చస్సుతో పాటు ఆకట్టుకునే మాటతీరు చూడగానే వాళ్లు ప్రతిభావంతులనే విషయం తెలిసిపోతుంది. వాళ్లు అలా చురుకుగా ఉండటానికి బుధుడి అనుగ్రహం ఎక్కువగా ఉండటమే కారణమని శాస్త్రం స్పష్టం చేస్తోంది. చదువుపట్ల ఏకాగ్రత కుదరడానికీ ... ఆసక్తి పెరగడానికీ ... రాణించడానికి బుధుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది.

భక్తి శ్రద్ధలతో బుధుడిని సేవించడం వలన ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు. బుద్ధిని వికసింపజేస్తూ .. జ్ఞాపకశక్తిని పెంచుతూ .. అసమానమైన ప్రతిభావంతులుగా అనుగ్రహిస్తాడు. ప్రతినిత్యం బుధుడి స్తోత్రం చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు చదువులో రాణిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News