ఆలయ పవిత్రతను కాపాడే తేనెటీగలు !

ఆలయ పవిత్రతను కాపాడే తేనెటీగలు !
భగవంతుడు అడుగడుగునా ఉన్నాడు ... అణువణువునా ఉన్నాడు. అయితే ఆయన పాదస్పర్శ కారణంగా పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. ఆ క్షేత్రాలను దర్శించడం వలన, అక్కడి తీర్థాలలో స్నానమాచరించడం వలన సమస్త పాపాలు హరించివేయబడతాయి. పాపాల ఫలితాలుగా వెంటాడే ఆరోగ్యపరమైన సమస్యలు ... ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది.

అందువల్లనే పుణ్యక్షేత్రాలను దర్శించాలనే ఆరాటం అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. అయితే సరదాగా గాలిమార్పు కోసం అలా బయటికివెళ్లి రావడానికీ ... విహారానికి వెళ్లడానికి ... పుణ్యక్షేత్రాలకి వెళ్లడానికి చాలాతేడా ఉంటుంది. వినోదం కోసం విహారానికి వెళ్లడానికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించవలసిన పనిలేదు. కానీ భగవంతుడి ఆవాసంగా చెప్పబడుతోన్న పుణ్యక్షేత్రాలకి వెళ్లడానికి కొన్ని నియమనిబంధనలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది.

పుణ్యక్షేత్రాల్లో అడుగుపెట్టే వాళ్లకి పద్ధతి ... పరిశుభ్రత ఎంతో అవసరం. ముఖ్యంగా మైల - అంటూ వంటివి లేకుండా చూసుకోవాలి. అక్కడి తీర్థ జలాలను తాకకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నవారు నదిని దాటడానికి పడవఎక్కితే అది కదలక పోవడం ... క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నించిన వారికి ఒళ్లంతా మంటలు రావడం వంటి సంఘటనలు కొన్ని క్షేత్రాల్లో జరుగుతుంటాయి.

అలా మైలతో అడుగుపెట్టే వారిపై తేనెటీగలు దాడిచేసే సంఘటన మనకి ప్రకాశం జిల్లా 'నెమలి గుండ్ల' లో కనిపిస్తుంది. ఇక్కడి రంగనాయక స్వామిని దర్శించుకునే భక్తులు పవిత్రతలో ఏ మాత్రం తేడారాకుండా చూసుకోవాలని స్థానికులు చెబుతుంటారు. లేదంటే వారిపై తేనెటీగలు దాడి చేసే అవకాశముందని హెచ్చరిస్తుంటారు. స్వామివారి క్షేత్ర పవిత్రతను ఈ తేనెటీగలు కాపాడుతూ ఉంటాయనీ, అందుకు భంగం కలిగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తగిన ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుందని అంటారు.

సంకల్ప మాత్రం చేతనే దేవుడు ఆవిర్భవిస్తుంటాడు. ఆయన సంకల్పం మేరకే అక్కడ తీర్థ జలాలు సృష్టించబడుతుంటాయి. అలాంటి క్షేత్రాలకి అదృశ్య రూపంలో ఎంతోమంది దేవతలు ... మహర్షులు వస్తుంటారు. ఆ తీర్థ జలాల్లో స్నానమాచరించి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అందువల్లనే అలాంటి క్షేత్రాల్లో తప్పనిసరిగా పద్ధతిగా నడచుకోవాలి ... తమ కారణంగా ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చూసుకోవాలి.

More Bhakti Articles