వెన్నలా కరిగిపోయే వేంకటేశ్వరుడు

వెన్నలా కరిగిపోయే వేంకటేశ్వరుడు
వెన్నెలవంటి చూపు ... వెన్నవంటి మనసున్నవాడు తిరుమల శ్రీవేంకటేశ్వరుడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన పాదాలను కడుగుతాడు. సమస్త దేవతలు ఆ స్వామికి అనునిత్యం పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలాగని చెప్పేసి ఆయన గొప్పవారి గోత్రాలను మాత్రమే వింటాడని అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది.

మట్టి ముద్దలనే పువ్వులుగా భావించి సమర్పించిన కురువ నంబిని అనుగ్రహించిన వాడాయన. తరిగొండ వెంగమాంబతో పరాచికాలడటం ... హథీరామ్ బావాజీతో పాచికలాడటం ... అన్నమయ్యతో అడిగిమరీ కీర్తనలు పాడించుకోవడం భక్తులపట్ల ఆయనకిగల అనురాగానికి అద్దం పడుతుంటాయి.

ఇక అన్నమయ్య జీవితాన్నే పరిశీలిస్తే ఆయన జీవితాన్ని ఆ వేంకటేశ్వరుడు ఎలాంటి అనూహ్యమైన మలుపులను తిప్పినది అర్థమవుతుంది. రాగాలను అనురాగంతో అభిషేకించగలిగితే వేంకటేశ్వరుడు వెన్నలా కరిగిపోతాడని స్పష్టమవుతుంది. భగవంతుడు భక్తుడి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేయగలడో, ఓ భక్తుడు దైవాన్ని ఏ స్థాయిలో మెప్పించగలడో అనేది వీరిద్దరి విషయంలో స్పష్టమవుతుంది.

తిరుమలలో అడుగుపెట్టిన అన్నమయ్య అనుక్షణం స్వామిని గురించే ఆలోచిస్తూ అనేక సంకీర్తనలను రచిస్తాడు. ఆ సంకీర్తనలను సాళ్వనరసింహరాయలు రాగిరేకులపై భద్రపరుస్తాడు. వయసు పైబడిన అన్నమయ్యకి తాను శరీరాన్ని వదలవలసిన సమయం దగ్గర పడిందని అర్థమవుతుంది. దాంతో తానురాసిన సంకీర్తనలను ఆనందనిలయానికి తీసుకుని వెళ్లి స్వామికి వాటిని అంకితం చేస్తాడు. అన్నమయ్య భక్తి శ్రద్ధలకు మెచ్చిన స్వామి ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు.

ఆ సాక్షాత్కారం పట్ల అన్నమయ్య సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. అన్నమయ్య కీర్తనలలో తనకి బాగా నచ్చినవాటిని గురించి స్వామి చెబుతాడు. తాను రాసిన కీర్తనలు సాక్షాత్తు పరంధాముడి నోటివెంట విన్న అన్నమయ్య పులకించిపోతాడు. తన జీవితం ధన్యమైందనీ ... తనకి మోక్షాన్ని ప్రసాదించమని స్వామిని కోరతాడు. ఆయన కోరికను స్వామి మన్నించడంతో అన్నమయ్య వేంకటేశ్వరుడిలో ఐక్యమైపోతాడు.

More Bhakti Articles