కృష్ణుడి కోసం గోపికలు దేహత్యాగం చేశారా ?

కృష్ణుడి కోసం గోపికలు దేహత్యాగం చేశారా ?
శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాల్లో రామావతారానికి ... కృష్ణావతారానికి గల ఆదరణ ... ఆకర్షణ అంతా ఇంతా కాదు. అటు రాముడు ... ఇటు కృష్ణుడు ఇద్దరూ కూడా సాధారణ ప్రజలతో కలిసి ధర్మమార్గాలను ఆవిష్కరించారు. నిండు కుండలా తొణకకుండా గంభీరంగా తన ఉన్నతమైన వ్యక్తిత్వంతో రాముడు అందరికీ ఆదర్శమూర్తిగా నిలిచాడు. ఇక ఆడుతూ పాడుతూ ప్రజల్లో కలిసిపోతూ కృష్ణుడు అందరినీ ఆకట్టుకున్నాడు.

ఈ కారణంగానే ఆనాటి ప్రజలు వీరిని విడిచి ఉండలేకపోయారు. సరయు నది తీరంలో శ్రీ రాముడు దేహత్యాగం చేసినప్పుడు, ఆయనని ఆరాధించేవారు ఇక తాము జీవిచడం వలన ప్రయోజనం లేదనుకుని దేహత్యాగం చేశారట. అలాగే శ్రీకృష్ణుడు ద్వారకలో గల 'ప్రభాస తీర్థం' సమీపంలో దేహత్యాగం చేశాడు.

బాల్యంలో శ్రీకృష్ణుడి ఆటపాటలు ... యవ్వనంలో ఆయన చేసిన కొంటెపనులు ... మహాభారత యుద్ధసమయంలో మానసిక పరిపక్వతతో వ్యవహరించిన తీరు కృష్ణుడి వ్యక్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. అలాంటి కృష్ణుడు ఇక భౌతికంగా తమమధ్య లేడనే విషయాన్ని ఆయన సహచరులు ... పురజనులు తట్టుకోలేకపోయారు. ఇక గోపికల పరిస్థితి వర్ణనాతీతం ... కృష్ణుడు లేకుండా గడిపే అరక్షణమైనా అర్థంలేనిదేనని వాళ్లు భావించారు.

కృష్ణుడు దేహత్యాగం చేసిన ప్రభాస తీర్థం సమీపంలోగల కొలనులో వాళ్లు దేహత్యాగం చేశారు. ఈ కారణంగానే ఇప్పుడీ కొలను 'గోపీతాలాబ్' పేరుతో వ్యవహరించబడుతోంది. ఈ కొలను దగ్గర కూర్చుంటే ఆనాటి ఘట్టం కళ్లముందు కదలాడుతుంది. గోపికలు లేకున్నా.. కృష్ణుడితో వాళ్లు గడిపిన మధురమైన క్షణాలు, మధురమైన జ్ఞాపకాలుగా ఆ కొలనులో తెలియాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన మన మనసులోనే ఉన్నాడని సర్దిచెప్పుకోకపోతే, కన్నీటి ధారలు ఆ కొలనులోని నీటితో కబుర్లు చెబుతూనే ఉంటాయి.

More Bhakti Articles