తల్లిపాల రుణం తీరదని చెప్పిన ఆలయం

కాశీ క్షేత్రం పరమ పవిత్రమైనదిగా ... మహిమాన్వితమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని చూడాలనీ, అక్కడి గంగానదిలో స్నానమాచరించాలని ప్రతిఒక్కరూ అనుకుంటూ ఉంటారు. జన్మజన్మల పాపాలను కడిగేసే గంగానదీ తీరంలో మణికర్ణిక ఘట్టం ఒకటిగా చెప్పబడుతోంది. ఆ మణికర్ణిక ఘట్టం సమీపంలో 'దూధ్ కా కర్జ్' పేరుతో ఓ ఆలయం కనిపిస్తుంది. గంగా నదిలోకి ఒరిగిపోయి కనిపించే ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగివుంది.

పూర్వం ఓ యువకుడు తన తల్లిని ఎంతగానో ప్రేమించేవాడట. తల్లి కష్టార్జితంపై ఆధారపడిన ఆ యువకుడు జీవితంలో అంచెలంచలుగా ఎదుగుతాడు. ఎంతగానో కష్టపడి తనని పెంచి పెద్దచేసిన తల్లి రుణం తీర్చుకోవాలని అతను నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా గంగానది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆ తరువాత తన తల్లి దగ్గరికి వెళ్లి ఆ గుడి గురించి ఆమెకి చెబుతాడు. ఆమె రుణం తీర్చుకోవడం కోసమే తాను గుడి కట్టినట్టుగా చెబుతాడు. ఆ గుడిని చూడటానికి రమ్మంటూ తొందరపెడతాడు.

ఆ మాటకి ఆమె పెద్దగా స్పందించకపోవడం ... నవ్వేసి ఊరుకోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే విషయాన్ని ఆమె దగ్గర అతను వ్యక్తం చేస్తాడు. జీవితంలో ఎవరూ ఎప్పటికీ తీర్చుకోలేనిది తల్లిపాల రుణం ఒక్కటేనని, అది అతను తీర్చుకున్నానని చెబుతుండటాన్ని నమ్మలేకపోతున్నానని తల్లి అంటుంది. తల్లి రుణం తీర్చుకునేదే అయితే అతను నిర్మించిన ఆలయం నిటారుగా నిలిచి ఉంటుందనీ, లేదంటే గంగానది ఒడివైపు ఒరిగిపోతుందని చెబుతుంది.

ఆ మాట వింటూనే అతను తాను కట్టిన గుడి దగ్గరికి వేగంగా నడవడం మొదలుపెడతాడు. గుడికి కొంత దూరంలో ఉండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. తాను కట్టిన గుడి గంగానదిలోకి ఒరిగిపోయి ఉండటం చూస్తూ కన్నీళ్ల పర్యంతమవుతాడు. తల్లిపాలకు వెలకట్టడం ఎవరువలన కాదని తెలుసుకుని వెళ్లి ఆమె పాదాలకు నమస్కరిస్తాడు. ఈ కారణంగానే ఈ ఆలయాన్ని 'దూధ్ కా కర్జ్' అని పిలుస్తుంటారు.


More Bhakti News