దేవుడు తన భక్తులను ఇలా పరీక్షిస్తాడు !

దేవుడు తన భక్తులను ఇలా పరీక్షిస్తాడు !
భగవంతుడికి ఆద్యంతాలు లేవు ... ఆయన అనంతమయ తేజో స్వరూపుడు. సాధారణ మానవమాత్రులు ఆయన రూపాన్ని ఊహించుకోవడమే తప్ప, ఈ చర్మ చక్షువులతో ఆయనని చూడలేరు. అందుకే ఆయన అనేక రూపాల్లో భక్తుల చెంతకు చేరుతుంటాడు. ఇక ఆ సమయంలో ఆయనని గుర్తించడం ... గుర్తించక పోవడం ఆయా భక్తులు సాధించిన మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది.

ఇందుకు ఉదాహరణగా గురువాయూరుకి చెందిన వాసుదేవుడు అనే భక్తుడి జీవితంలో జరిగిన ఒక సంఘటనను గురించి చెప్పుకోవచ్చు. పూర్వం వాసుదేవుడనే భక్తుడు శ్రీ కృష్ణుడిని అనునిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు. పరమాత్ముడిని పసివాడిలా భావిస్తూ ... సేవిస్తూ గడుపుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఆయనకి కృష్ణుడిని చూడాలనిపిస్తుంది. ఆయన అనురాగాన్ని అర్థం చేసుకున్న కృష్ణుడు మరునాడు ఉదయం దర్శనమిస్తానని అశరీర వాణిగా చెబుతాడు.

ఆ మరునాడు ఉదయం కృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి, నైవేద్య సమర్పణ మినహా మిగతా పూజ కానిస్తాడు వాసుదేవుడు. ప్రత్యక్షంగా రానున్న కృష్ణుడికే నైవేద్యం సమర్పించాలని స్వామి కోసం ఎదురు చూస్తుంటాడు. అంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి ఆ నైవేద్యాన్ని చూపిస్తూ అది తనకి పెట్టమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు వచ్చే సమయానికి ఆ వ్యక్తి వచ్చి అలా అడగడంతో వాసుదేవుడు విసుక్కుంటాడు. అసహనంతో ఆ వృద్ధుడిని తోసేయడంతో ఆయన నడుము భాగం దెబ్బతింటుంది. దాంతో ఆ ముసలివ్యక్తి అక్కడే కుప్పకూలిపోయి ఆ వెంటనే అదృశ్యమైపోతాడు.

సరిగ్గా ఆ సమయంలోనే, వాసుదేవుడు పూజించే శ్రీకృష్ణుడి ప్రతిమ కూడా నడుము భాగం దెబ్బతిని రెండు ముక్కలవుతుంది. ముసలి వ్యక్తి వేషంలో వచ్చినది శ్రీకృష్ణుడేననే విషయం అప్పుడు వాసుదేవుడికి అర్థమవుతుంది. తన అజ్ఞానాన్ని మన్నించమని ఆయన కన్నీళ్లతో ఆ స్వామిని వేడుకుంటాడు. భగవంతుడి రాకను గుర్తించే జ్ఞానాన్ని తనకి ప్రసాదించమని కోరుకుంటాడు. భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చుననీ, ఆయన మనసు దోచుకోవాలంటే మానవత్వాన్ని కలిగి ఉండాలని తెలుసుకుంటాడు.

More Bhakti Articles