స్వామి పల్లకీ మోయలేకపోయిన భక్తులు

స్వామి పల్లకీ మోయలేకపోయిన భక్తులు
అక్కల్ కోట స్వామి ధోరణి చాలా విచిత్రంగా ఉండేది. ఆయన ఏ క్షణంలో ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ తెలిసేది కాదు. ఒక్కోసారి కొంతమంది భక్తుల తీరుపట్ల మండిపడుతున్నట్టు కనిపించిన ఆయన, ఆ మరుక్షణమే వారితో ఆత్మీయంగా ... చనువుగా ఉండేవారు. ఆయనలా వ్యవహరించడం వెనుక ఏదో కారణం ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

ఇక ఆయన మహిమలను ప్రత్యక్షంగా చూడాలని కొంతమంది భక్తులు రోజుల తరబడి నిరీక్షించి నిరాశ చెందేవారు. అంతలోనే స్వామి ఏదో ఒక మహిమ చేసి చూపేవారు. అయితే ఆ సంఘటనలో నుంచి తేరుకుని అది మహిమ అని తెలుసుకోవడానికి వాళ్లకి కొంత సమయం పట్టేది. ఆ తరువాత ఆనందాశ్చర్యాలకి లోనవుతూ వాళ్లు స్వామి దగ్గర నుంచి సెలవుతీసుకుంటూ ఉండేవాళ్లు.

ఈ నేపథ్యంలోనే ఒకసారి కొంతమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటోన్న సమయంలో వర్షం మొదలవుతుంది. తనని పల్లకీలో ఎక్కించి ఆ వర్షంలో తిప్పమని భక్తులను స్వామి ఆదేశిస్తాడు. అంతకుమించిన అదృష్టం లేదన్నట్టుగా భక్తులు స్వామిని పల్లకీలో ఎక్కించి నడవడం మొదలుపెడతారు. అయితే క్షణక్షణానికి పల్లకీ బరువు పెరిగిపోతూ ఉండటంతో భక్తులు ఆశ్చర్యపోతారు.

ఇక పల్లకీని మోయడం తమ వల్ల కాదన్నట్టుగా కిందకు దింపేస్తారు. చిరుమందహాసంతో వారివైపు చూస్తూ విషయమేవిటని అడుగుతాడు స్వామి. ఆయన బరువు తగ్గకపోతే తాము పల్లకీని మోయలేమని చెబుతూ, తమని పరీక్షించవద్దని కోరతారు. సరే మరోసారి ప్రయత్నించి చూడమని చెబుతాడు స్వామి. ఈ సారి భక్తులు పల్లకిని పైకి లేపుతారు. అంతకుముందు ఖాళీ పల్లకీ ఉన్నంత బరువు కూడా ఇప్పుడు లేకపోవడం వారిని ఆశ్చర్యచకితులను చేస్తుంది.

అలా స్వామిని భక్తులు వర్షంలో తిప్పి తీసుకువస్తారు. స్వామివారు హఠాత్తుగా బరువు పెరగడం ... తగ్గడం గురించి భక్తులు ప్రస్తావిస్తారు. మొదట వాళ్లు మోసినది తన శరీరాన్ననీ ... ఆ తరువాత వాళ్లు మోసినది తన ఆత్మని మాత్రమేనని చెబుతాడు స్వామి. మరింత ఆశ్చర్యపోయిన భక్తులు ఆయన పాదాలకు సవినయంగా నమస్కరిస్తారు.

More Bhakti Articles