బాబా మాటలు వృధా పోతాయా ?

బాబా మాటలు వృధా పోతాయా ?
ఒకసారి దాసగణుని బాబా పిలిచి తన సన్నిధిలోనే పాండురంగడి నామసప్తాహాన్ని ఏర్పాటు చేయమని చెబుతాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్, నామసప్తాహం ముగియగానే తమకి పాండురంగడి దర్శనం కావాలని అంటాడు. ఆ పాండురంగడు ఇక్కడే ఉన్నాడనీ, భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే ఆయన దర్శనం తప్పక లభిస్తుందని అంటాడు బాబా. అంతే కాకుండా పండరీపురం నుంచి ఏదో ఒక రూపంలో పాండురంగడు వారి చెంతకు చేరతాడని చెబుతాడు.

దాంతో దాసగణు నామసప్తాహాన్ని ఆరంభిస్తాడు. అంకితభావంతో కాకాసాహెబ్ ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు. సప్తాహం పూర్తి కాగానే ధ్యానంలో ఉన్న కాకాసాహెబ్ కి పాండురంగడి దర్శనమవుతుంది. ఆ సమయంలో ఆయన పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతాడు. కనులకు చిక్కినవాడిని మనసులో మచ్చికతో కట్టేసుకోమని ఆయనతో అంటాడు బాబా.

తనకి స్వామి దర్శనం లభించిందనే విషయం బాబాకి తెలిసిపోయిందని ఆయన గ్రహిస్తాడు. ఇక బాబా అన్నట్టుగా పాండురంగడు తమ దగ్గరికి ఏ రూపంలో వస్తాడో చూడాలని ఆయన అనుకుంటాడు. అంతలోనే పండరీపురం నుంచి పాండురంగడి చిత్ర పటాలు అమ్మే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇదంతా బాబా లీలయేనని గ్రహించిన కాకాసాహెబ్, వెంటనే ఒక చిత్రపటాన్ని కొని దగ్గర పెట్టుకుంటాడు.

ఇదంతా గమనిస్తోన్న బాబా ఆయన వైపు చిరునవ్వు చిందిస్తూ చూస్తాడు. కోరినవాడు చెంత చేరాడు కనుక కోటి నామాలతో పూజించుకోమని చెబుతాడు. ఆ రోజు నుంచి ఆయన ఆ చిత్రపటాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు. బాబాతి సమానంగా దానిని అనుక్షణం ఆరాధిస్తూ ఉండేవాడు.

More Bhakti Articles