వశిష్ఠ మహర్షి తపస్సు చేసుకున్న గుహ

వశిష్ఠ  మహర్షి తపస్సు చేసుకున్న గుహ
కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నప్పుడు గతంలో అక్కడ మునులు ... మహర్షులు తపస్సు చేసుకున్నారని అక్కడి వాళ్లు కొన్ని ప్రదేశాలను చూపిస్తుంటారు. అక్కడ ఎలాంటి ఆనవాళ్ళూ కనిపించని కారణంగా ఎవరూ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. నిజమో .. కాదో అనే సందేహం తలెత్తడమే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే 'ఋషికేశ్' ను దర్శించినప్పుడు మాత్రం ఇలాంటి సందేహాలు ఎంతమాత్రం తలెత్తవు.

ఎందుకంటే ఎంతోమంది మహర్షులు తపస్సు చేసుకున్న పరమపవిత్రమైన ప్రదేశం కనుకనే ఈ ప్రాంతానికి 'ఋషికేశ్' అనే పేరువచ్చింది. అందుకు నిదర్శనంగా ఇక్కడి కొండలపై అనేక గుహలు దర్శనమిస్తూ ఉంటాయి. మహర్షుల పాదధూళి కారణంగానే ఇక్కడి నేల పుణ్యభూమిగా వెలుగొందుతోంది. వారి తపోబలం చేత వేదభూమిగా వర్ధిల్లుతోంది. అలాంటి ఈ ప్రదేశంలో 'వశిష్ఠ మహర్షి గుహ' కూడా కనిపిస్తుంది.

ఇంద్రాది దేవతలచే 'బ్రహ్మరుషి' గా ప్రశంసలు అందుకున్న ఘనత ఒక్క వశిష్ఠ మహర్షికే దక్కింది. ఇక మహాపతివ్రతగా త్రిశక్తి మాతలనే ఆశ్చర్య పరిచిన 'అరుంధతి' ఆయన సతీమణి. శ్రీమన్నారాయణుడు ... శ్రీ రాముడిగా ఇక్ష్వాకు వంశంలో జన్మించనున్నాడని ముందుగానే తెలుసుకుని, ఆ వంశీకులకు కులగురువుగా వ్యవహరించిన శక్తి సంపన్నుడు ఆయన. బ్రహ్మరుషి కావడం ఎంత కష్టమో వినయంగానే విశ్వామిత్రుడికి తెలియజేసిన మహాజ్ఞాని.

అలాంటి వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ఈ గుహను చూడగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ గుహను చూడగానే మనకి తెలిసిన మహర్షి రూపం కనులముందు కదలాడుతుంది. కంటికి కనిపించని దివ్యమైన తేజస్సు మనలను గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతోన్న ఆ ప్రదేశానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి భక్తులు ముందుకు సాగుతూంటారు.

More Bhakti Articles