వెలుగును ప్రసాదించే వేంకటేశ్వరుడు

వెలుగును ప్రసాదించే వేంకటేశ్వరుడు
జీవితంలో కష్టాలనేవి అందరికీ వస్తూనే ఉంటాయి. నిజానికి కెరటాలు లేని సముద్రం ... సమస్యలు లేని జీవితం కనిపించవు. ఆరోగ్యపరమైన .. ఆర్ధికపరమైన ... వివాహ పరమైన సమస్యలు మనిషిని మానసికంగా కుంగదీస్తూ ఉంటాయి. ఇలా ఎవరి స్థాయిలో వాళ్లకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది.

ఇక సమస్య ఎదురైనప్పుడు దానిని ఎలా అధిగమించాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే సమస్య అనేది పరిష్కార మార్గాన్ని గురించి ఆలోచించకుండా చేస్తూ ఉంటుంది. పరిష్కార మార్గం దొరికినప్పుడు తాము అంతగా ఆందోళన చెందినది ఈ మాత్రం దానికేనా అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా సమస్యలతో బాధలు పడుతున్నవారికి ఏలూరు ఆర్.ఆర్.పేటకి చెందిన వేంకటేశ్వరుడు వెలుగును చూపిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

పూర్వం ఇక్కడ చిన్నపాకలో స్వామివారు ఉండేవారట. అయితే అనేక సమస్యలతో భక్తులు ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ఆ సమస్యలు పరిష్కారం కావడం మొదలుపెట్టాయి. దాంతో స్వామివారి పట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగిన భక్తులు ఒక బృందంగా ఏర్పడి సువిశాలమైన ఆలయ నిర్మాణానికి తమవంతు కృషి చేశారు. విశాలమైన ప్రదేశంలో పొడవైన ప్రాకారాలు ... తీర్చిదిద్దబడిన రాజగోపురం ... మనసుదోచే మంటపాలు ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి.

గర్భాలయంలో కొలువైన స్వామివారి నిలువెత్తుమూర్తి సమ్మోహితులను చేస్తుంది. ఆ సౌందర్యం ... అలంకారం చూసితీరవలసిందే. ప్రత్యేక మందిరాలలో అమ్మవార్లు దర్శనమిస్తూ ఉంటారు. పర్వదినాల సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. భక్తుల విన్నపాలను సహనంతో వింటూ, వాళ్లు చెల్లించే మొక్కుబడులను సంతోషంతో స్వీకరిస్తూ ఇక్కడి వేంకటేశ్వరుడు అనుగ్రహిస్తుంటాడు ... ఆనందింపజేస్తూ ఉంటాడు.

More Bhakti Articles