పార్వతీ పరమేశ్వరులు సహించలేనిది ఏమిటి ?

పార్వతీ పరమేశ్వరులు సహించలేనిది ఏమిటి ?
చ్యవన మహర్షి ... సుకన్య దంపతుల సమక్షంలో శల్యాతి మహారాజు దంపతులు పుత్రకామేష్టి యాగాన్ని తలపెడతారు. ఆ యాగాన్ని అడ్డుకోవడానికి దేవేంద్రుడు చేసిన ప్రయత్నాన్ని తన పాతివ్రత్య మహిమతో సుకన్య ఎదుర్కుంటుంది. దాంతో దేవేంద్రుడు ఆగ్రహావేశాలకి లోనవుతాడు. అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను ఆమె పైకి ప్రయోగిస్తాడు. అవి నిర్వీర్యమవుతూ ఉండటంతో, చివరిగా వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు.

దాంతో సుకన్య ఆదిదంపతుల అనుగ్రహాన్ని అర్థిస్తుంది. దాంతో వజ్రాయుధం సైతం సుకన్య పై ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది. ఊహించని ఈ సంఘటనకి దేవేంద్రుడు బిత్తరపోతాడు. పర్వతం వంటి ఒక ఆకారం తనపైకి వస్తుండటంతో, ప్రాణభయంతో బ్రహ్మ - విష్ణులను శరణు కోరతాడు. పతివ్రతల విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం పట్ల వాళ్లు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తారు.

ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీలేదనీ, ఆదిదంపతులను శరణు వేడుకోవడమే అన్నివిధాలా మంచిదని బ్రహ్మ - విష్ణువు సూచిస్తారు. దాంతో కైలాసానికి చేరుకొని పరిస్థితిని వివరిస్తాడు దేవేంద్రుడు. పరమ పతివ్రత అయిన సుకన్య పట్ల అతను వ్యవహరించిన తీరుపట్ల ఆదిదంపతులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తారు. సుకన్య తమ భక్తురాలనే విషయాన్ని కూడా మరిచిపోయి అతను ప్రవర్తించడం తాము సహించమని చెబుతారు. పతివ్రతల శక్తిని ఎవరూ అడ్డుకోలేరనీ, సుకన్యను శరణు వేడుకోవడం మినహా మరో మార్గం లేదని వాళ్లు చెబుతారు.

దాంతో తిరిగి సుకన్య దగ్గరికే వెళ్లి తనని మన్నించమని కోరతాడు దేవేంద్రుడు. అందుకు ఆమె అంగీకరించడంతో దేవేంద్రుడు తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు. అశ్వనీ దేవతలకు హవిర్భాగాన్ని అందించడానికి అంగీకరిస్తున్నట్టుగా చెబుతాడు. అంతటి మహద్భాగ్యాన్ని తమకి కల్పించిన సుకన్య దంపతులకు అశ్వనీ దేవతలు కృతజ్ఞతలు తెలియజేస్తారు.

More Bhakti Articles