పంటపొలాలను రక్షించే పోలమాంబ క్షేత్రం

పంటపొలాలను రక్షించే పోలమాంబ క్షేత్రం
ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తన బిడ్డల జీవనోపాదిని కాపాడటానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే అమ్మవారిని అనేక నామాలతో పిలుచుకుంటూ, అంకిత భావంతో ఆమెను ఆరాధిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలా అమ్మవారు 'పోలమాంబ' పేరుతో కొలవబడుతోన్న క్షేత్రం మనకి విశాఖ జిల్లా 'పెదవాల్తేరు' లో దర్శనమిస్తుంది.

ఈ ప్రాంతానికి చెందిన పంటపొలాలను రక్షించడంలో అమ్మవారు ప్రధానమైన పాత్రను పోషిస్తుండటం వలన, పోలమాంబ పేరుతో ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన జాలరులు సముద్రంలో చేపల వేటకి వెళ్లగా అమ్మవారి విగ్రహం వలలో పడిందట. దాంతో జాలరులంతా అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించుకుని పూజించడం ప్రారంభించారు. ఈ కారణంగా ఈ అమ్మవారిని సముద్ర దేవతగా ... జలదేవతగా ఇక్కడి ప్రజలు భావిస్తుంటారు.

ఇక్కడ వర్షాలు పడటానికీ ... ఆర్ధికపరమైన ఇబ్బందులు లేకపోవడానికి అమ్మవారి అనుగ్రహమే కారణమని నమ్ముతుంటారు. ఆ తల్లిని తమ ఇలవేల్పుగా భావించి తొలి పంటలో తొలి భాగాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. గర్భాలయంలో అమ్మవారితోపాటు కుంచమాంబ - నీలమాంబ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు అమ్మవార్లను పార్వతీదేవి .. లక్ష్మీదేవి .. సరస్వతీదేవిగా భక్తులు విశ్వసిస్తుంటారు.

త్రిశక్తి మాతలు కొలువుదీరిన ఈ క్షేత్రంలో, ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని తొమ్మిది రోజులపాటు జాతర జరుగుతుంటుంది. ఇక దసరా నవరాత్రుల్లో అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి రెండు కళ్ళూ సరిపోవు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, అమ్మవారికి మొక్కుబడులు చెప్పుకుంటూ ... చెల్లించుకుంటూ ఉంటారు.

More Bhakti Articles