శివుడికై రావణుడు ఎక్కడ తపస్సు చేశాడు?

శివుడికై రావణుడు ఎక్కడ తపస్సు చేశాడు?
మహాపరాక్రమవంతుడిగా ఇంద్రాది దేవతలచే పేర్కొనబడిన రావణాసురుడు, మహాశివుడిని అమితంగా ఆరాధించేవాడు. ఎక్కడ ఉన్నా ఒక నియమితమైన సమయం ప్రకారం శివ పూజను పూర్తి చేసేవాడు. ప్రతి ఉదయం శివారాధన పూర్తి చేసిన తరువాతనే తన దైనందిన కార్యక్రమాలు చక్కబెడుతూ ఉండేవాడు. అలాంటి రావణాసురుడు కైలాసగిరిని తన లంకానగరానికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు.

అనునిత్యం తన తల్లి మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండటం చూసిన రావణుడు, తన తల్లిని సంతోషపెట్టడం కోసం కైలాస గిరిని తీసుకురావాలని అనుకుంటాడు. కైలాసగిరి ప్రాంతానికి చేరుకొని శివుడి అనుగ్రహం కోసం అక్కడగల సరస్సులోకి దిగి తపస్సు చేయడం మొదలుపెడతాడు. ఆ తరువాత శివుడు ప్రత్యక్షమై తన ఆత్మలింగాన్ని రావణుడికి ప్రసాదించడం, అది లంకా నగరానికి చేరకుండా నారద మహర్షి - వినాయకుడు కలిసి పథక రచన చేయడం జరుగుతుంది.

ఇక శివుడి కోసం రావణుడు తపస్సు చేసినట్టుగా చెప్పబడుతోన్న ఈ సరస్సు ఇప్పుడు 'రాక్షస తాల్' పేరుతో పిలవబడుతోంది. ఇది హిమాలయ పర్వత ప్రాంతంలో గల కైలాసగిరికి ... మరోవైపున గల మానస సరోవరానికి సమీపంలో కనిపిస్తుంది. 225 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ... సముద్ర మట్టానికి 15000 అడుగుల ఎత్తులో రాక్షస తాల్ దర్శనమిస్తూ ఉంటుంది. రావణుడి కారణంగానే ఈ సరస్సుకు ఈ పేరు వచ్చింది. చిత్రమైన రంగులో కనిపించే ఈ సరస్సులోని నీరు ఆశ్చర్య చకితులను చేస్తుంది.

మానస సరోవర జలాలు ఈ నీటిలో కలుస్తుండటం వలన ఈ సరస్సు కూడా పవిత్రమైనదేనని యాత్రికులు భావిస్తుంటారు. మరికొందరు ఆ విషయాన్ని అంగీకరించడానికి ఇబ్బంది పడుతుంటారు. ఏదేవైనా శివుడి మనసును రావణుడు గెలుచుకున్న ఈ ప్రదేశాన్ని చూడగానే ఆహ్లాదం కలుగుతుంది ... ఆయుష్షు ఉన్నంత వరకూ అనిర్వచనీయమైన అనుభూతిగానే మిగులుతుంది.

More Bhakti Articles