రావణ సంహారంలో నందీశ్వరుడి పాత్ర !

రావణుడు అనునిత్యం ఆదిదేవుడిని ఆరాధించే మహాభక్తుడు. అసమానమైన భక్తినే కాదు ... అంతకుమించిన పరాక్రమాన్ని ప్రదర్శించడంలోను ఆయనకి ఆయనే సాటి. అలాంటి రావణుడు సముద్రంలా విరుచుకుపడుతున్న వానర సైన్యాన్ని చూసి బిత్తరపోతాడు. వానరవీరుల పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అలా రావణుడు వానర సైన్యం కారణంగా ఇబ్బంది పడటానికి వెనుక బలమైన కారణం లేకపోలేదు.

ఒకసారి రావణుడు పుష్పక విమానంలో 'మహాశరవణం' అనే ప్రదేశం మీదుగా ప్రయాణించడానికి ప్రయత్నిస్తాడు. అక్కడికి రాగానే ఆ విమానాన్ని నందీశ్వరుడు అడ్డుకుంటాడు. పార్వతీ పరమేశ్వరులు అక్కడ విహరిస్తూ ఉన్నారనీ, వాళ్ల ఏకాంతానికి భంగం కలిగించ వద్దని చెబుతాడు. తనంతటివాడిని అలా నిలువరించడాన్ని రావణుడు అవమానంగా భావిస్తాడు. నందీశ్వరుడి రూపం ... ప్రవర్తన వానరాన్ని గుర్తుకు తెస్తున్నాయంటూ ఎద్దేవా చేస్తాడు.

దాంతో నందీశ్వరుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తనని ఏ వానరుడిగానైతే పోల్చాడో, ఆ వానరుడి కారణంగానే ఆయన నగరం నాశనమవుతుందనీ, ఆయన సహచరులు సంహరించబడతారని నందీశ్వరుడు శపిస్తాడు. ఆ శాపం ఫలితంగానే హనుమంతుడు లంకానగరంలో గల సీత జాడ తెలుసుకోవడం జరుగుతుంది. వానరుల సహాయ సహకారాలతోనే శ్రీరాముడు రావణుడిని సంహరిస్తాడు. అలా రావణుడి సంహారంలో నందీశ్వరుడు కూడా ప్రధానమైన పాత్రను పోషించినట్టు అయింది.


More Bhakti News