గులాబీలుగా మారిన గులకరాళ్లు !

గులాబీలుగా మారిన గులకరాళ్లు !
త్రిశక్తిమాతల అభ్యర్థన మేరకు పంచభూతాలను చిత్రకూటంపైకి ఉసిగొల్పుతాడు దేవేంద్రుడు. దాంతో చిత్రకూటం ప్రజల జీవితం ఛిన్నాభిన్నం అవుతుంది. కరవుకాటకాలతో ప్రజలంతా నానాఇబ్బందులు పడుతుంటారు. అందరూకలిసి తమకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోన్న సదానందుడిని కలుసుకుని ఆవేదనను వ్యక్తం చేస్తారు.

అనసూయపై తనకి గల పగ తీర్చుకోవడానికి అదే మంచి అవకాశంగా భావిస్తాడు సదానందుడు. చిత్రకూటంలో ప్రకృతి విలయతాండవం చేయడానికి కారకురాలు అనసూయ అని వాళ్లతో చెబుతాడు. ఆశ్రమ ధర్మాలను అనసూయ మంటగలిపేలా ప్రవర్తించడం వల్లనే అలా జరిగిందని అంటాడు. అనసూయను ఆ ప్రదేశం నుంచి తరిమివేయడమే అందుకు మార్గమని వాళ్లని రెచ్చగొడతాడు.

ఆయన మాటలను గుడ్డిగా నమ్మిన గ్రామస్తులు ఆగ్రహావేశాలతో అనసూయమాతపై దాడి చేయడానికిగాను ఆశ్రమానికి వెళతారు. అనసూయను అనేక విధాలుగా నిందిస్తూ, ఆమె పైకి గులకరాళ్లు విసరడం మొదలుపెడతారు. ఊహించని ఈ సంఘటనకు అనసూయ విస్తుపోతుంది. ఆ రాళ్ల దెబ్బలు తట్టుకోవడానికి సిద్ధపడుతూ శివలింగం ముందు కూర్చుంటుంది.

ఆమె పాతివ్రత్య మహిమ కారణంగా ... పరమశివుడి అనుగ్రహం వలన ఆ గులకరాళ్లు గులాబీలుగా మారి ఆమెను చేరుతుంటాయి. అది గమనించిన గ్రామస్తులు తాము తప్పు చేస్తున్నామనే విషయాన్ని గ్రహిస్తారు. సదానందుడి మాటలను నమ్మి తొందర పడినందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తారు. మహా పాపం చేసినందుకు మన్నించమంటూ ఆ మహాఇల్లాలి పాదాలపై పడతారు.

పెద్ద మనసుతో వారిని మన్నించిన అనసూయాదేవి, చిత్ర కూటం ప్రాంతాన్ని సుభీక్షంగా చేయమని పరమశివుడిని ప్రార్ధిస్తుంది. దాంతో ఆ ప్రాంతమంతా వర్షాలు పడుతూ సస్యశ్యామలంగా మారిపోతుంది. ఇంద్రాది దేవతలు ఈ సంఘటనకి నివ్వెరపోగా, చిత్రకూటంలోని ప్రజలంతా సంతోషంతో పొంగిపోతూ అనసూయాదేవికి కృతజ్ఞతలు తెలియజేస్తారు.

More Bhakti Articles